‘ఫౌల్ర్టీ’కి గడ్డుకాలం
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:17 AM
Falling egg prices కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జిల్లాలో 100 గుడ్ల హోల్‌సేల్ ధర రూ.420గా ఉంది. అంటే ఒక్కో గుడ్డు రూ.4.20 పైసలన్న మాట. కానీ రిటైల్‌గా రూ.5వరకూ విక్రయిస్తున్నారు.
పడిపోయిన కోడిగుడ్ల ధరలు
వంద.. కేవలం రూ.420
మున్ముందు మరింతగా తగ్గుదల
నష్టం తప్పదంటున్న నిర్వాహకులు
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్
రణస్థలం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జిల్లాలో 100 గుడ్ల హోల్‌సేల్ ధర రూ.420గా ఉంది. అంటే ఒక్కో గుడ్డు రూ.4.20 పైసలన్న మాట. కానీ రిటైల్‌గా రూ.5వరకూ విక్రయిస్తున్నారు. అయితే కొనుగోలుదారులైన ప్రజలకు ఇది శుభవార్త. కానీ కోళ్లఫారాలు నిర్వహిస్తున్నవారికి మాత్రం భారీ నష్టమనే చెప్పాలి. ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ (పశ్చిమాసియా) యుద్ధం నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికితోడు ఉత్పత్తి కంటే వినియోగం తగ్గింది. దీంతో ఫారం నిర్వాహకుల వద్ద కోడిగుడ్ల నిల్వలు పేరుకుపోయి.. ధరలు తగ్గుముఖం పట్టాయి. వాస్తవానికి మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎప్పటికప్పుడు ధరలు నిర్దేశిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.4.20గా చెబుతున్నా.. రూ.3ల వరకూ పతనం అవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే ఫౌల్ర్టీ ఫారం నిర్వాహకులకు కోలుకోలేని దెబ్బ ఖాయం. జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఫౌలీ్ట్రరైతులు(నిర్వాహకులు) అధికంగా ఉన్నారు. కోళ్ల దాణా ఖర్చులు పెరిగాయని, ఈ నేపథ్యంలో గుడ్ల ధర పతనమైతే ఫారాల నిర్వహణ కష్టమేనని నిర్వాహకులు వాపోతున్నారు. గతంలో జిల్లా నుంచి ఒడిశాకు కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అక్కడ కూడా ఫౌల్ర్డీఫారాలు పెరగడంతో జిల్లా నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఆ ప్రభావం కూడా జిల్లాలో గుడ్ల ధరపై చూపుతోందని పలువురు పేర్కొంటున్నారు.
పెరిగినట్టే పెరిగి..
గత ఏడాది డిసెంబరులో కోడిగుడ్ల ధర అమాంతం పెరిగింది. 100 గుడ్ల ధర రూ.775కు చేరుకుంది. అంటే ఒక్కో గుడ్డు హోల్‌సేల్‌గా రూ.7.75కు చేరింది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.8 వరకూ విక్రయించేవారు. దీంతో కోళ్లఫారం నిర్వాహకులకు లాభసాటిగా ఉండేది. ఈ ఏడాది జనవరి నాటికి ధర తగ్గింది. 100 గుడ్ల ధర రూ.575కు చేరుకుంది. తాజాగా రూ.420కి పడిపోగా.. మున్ముందు మరింత ధర తగ్గనుండడంతో కోళ్లఫారాల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. కాగా గుడ్ల ధరలు తగ్గినా.. జిల్లాలో చాలా ప్రాంతాల్లో వ్యాపారులు ఇంకా పాత ధరకే విక్రయిస్తున్నారు. రిటైల్‌గా ఒక్కో గుడ్డుపై రూ.6 వరకూ వసూలు చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్సిన అవసరం ఉంది.
సంక్షోభంలో పరిశ్రమలు
ఫౌల్ర్టీ పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి. కోడి గడ్డు ధర పతనం అంచున ఉంది. ఇలా అయితే కోళ్లఫారాల నిర్వహణ చాలా కష్టం. మరోవైపు రకరకాల వ్యాధులతో కోళ్లు చనిపోతున్నాయి. ధర స్థిరీకరణ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాయితీలతో పాటు కొన్నిరకాల మినహాయింపు ఇవ్వాలి.
- కొవ్యూరు కృష్ణారెడ్డి, అయ్యప్ప ఫౌల్ర్డీఫారం నిర్వాహకుడు, రణస్థలం