Share News

సిక్కోలు ప్రగతికి పెద్దపీట

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:43 AM

రాష్ట్ర కేబినెట్‌ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సిక్కోలు పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సిక్కోలు ప్రగతికి పెద్దపీట
మూలపేట పోర్టు

మూలపేట పారిశ్రామిక క్లస్టర్‌కు రూ.2,500 కోట్లు

నిధుల వినియోగానికి ఆమోదం

శ్రీకాకుళం-భీమిలి బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌

కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

శ్రీకాకుళం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కేబినెట్‌ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సిక్కోలు పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లావాసుల చిరకాల స్వప్నమైన మూలపేట పారిశ్రామిక క్లస్టర్‌ అభివృద్ధికి భారీ నిధుల వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు, తీరప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే భారీ ‘బీచ్‌ శాండ్‌ మినరల్స్‌’ ప్రాజెక్టుకు కేబినెట్‌ మార్గం సుగమం చేసింది. అలాగే ఉద్యోగుల డీఏ పెంపు, తదితర కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. జిల్లాకు సంబంధించిన కేబినెట్‌ నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి.

మూలపేట క్లస్టర్‌కు మహర్దశ ..

పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా మూలపేట పారిశ్రామిక క్లస్టర్‌ అభివృద్ధికి నిధుల కొరత తీరనుంది. ఏపీఐఐసీకి సాగరమాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మంజూరు చేసిన రూ. 2,500 కోట్ల టర్మ్‌ లోన్‌ను వినియోగించుకునేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో మూలపేటతో పాటు రాష్ట్రంలోని ఇతర పోర్టు క్లస్టర్లలో భూసేకరణ, బాహ్య మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయనున్నారు. దీంతో మూలపేట పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన ఊపందుకోనుండగా.. స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

బీచ్‌ శాండ్‌ మైనింగ్‌..

శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లా భీమునిపట్నం వరకు ప్రతిపాదించిన భారీ బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టు కోసం తీరప్రాంతంలో సేకరించే భూములకు ప్రత్యామ్నాయంగా అటవీకరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకుగాను బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బ్రహ్మసముద్రం గ్రామంలో ఏకంగా 1,618.265 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు కేటాయిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ అటవీకరణకు కోనసీమలో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు కావడంతో.. సిక్కోలు తీరంలో బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ ప్రాజెక్టు పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

ఉద్యోగులకు డీఏ పండుగ..

జిల్లాలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర కేబినెట్‌ తీపికబురు అందించింది. 2024 జూలై 1 నుంచి 2.73 శాతం, 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం చొప్పున రెండు విడతల డీఏ, డీఆర్‌ లను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులను కేబినెట్‌ రాటిఫై చేసింది. ఈ పెరిగిన డీఏ.. సెప్టెంబర్‌ (2026)నెల జీతంతో కలిపి అక్టోబరులో చేతికి రానుంది. బకాయిలను వచ్చే ఏడాది నుంచి విడతల వారీగా చెల్లించనున్నారు.

ఇతర కీలక నిర్ణయాలు..

జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమి లీజు కాలాన్ని ప్రస్తుతమున్న 33 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాలకు పొడిగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

అక్టోబరు నుంచి అమలు కానున్న నూతన మద్యం దుకాణాల (2026-27) ఎక్సైజ్‌ విధాన మార్గదర్శకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది.

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక కంటెంట్‌ క్రియేటర్లను (యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌) గుర్తించి, ఎంప్యానెల్‌ చేసే సరికొత్త ‘ఎస్‌ఎంఐ పాలసీ’ ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Updated Date - Sep 24 , 2026 | 12:43 AM