Share News

‘ఉపాధి’లో టాప్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:27 AM

Leading in the construction of houses for the poor రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడలో నిర్వహించిన 6వ కలెక్టర్ల సదస్సులో జిల్లా పనితీరుపై సమగ్ర నివేదిక వెల్లడైంది. జిల్లాలో సానుకూల, ప్రతికూల అంశాలను ప్రభుత్వం పారదర్శకంగా ప్రకటించింది.

‘ఉపాధి’లో టాప్‌
సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు, హాజరైన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • పేదల ఇళ్ల నిర్మాణాల్లోనూ ముందంజ

  • పన్నుల వసూలు, ఆస్తుల సర్వేలో వెనుకబాటు

  • అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

  • సిక్కోలుకు ఏ+ గ్రేడింగ్‌

  • జిల్లా సమగ్ర నివేదిక వెల్లడించిన ప్రభుత్వం

  • శ్రీకాకుళం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడలో నిర్వహించిన 6వ కలెక్టర్ల సదస్సులో జిల్లా పనితీరుపై సమగ్ర నివేదిక వెల్లడైంది. జిల్లాలో సానుకూల, ప్రతికూల అంశాలను ప్రభుత్వం పారదర్శకంగా ప్రకటించింది. ఉపాధిహామీ పనులు, పేదల ఇళ్ల నిర్మాణాల్లో సిక్కోలు రాష్ట్రస్థాయిలోనే సత్తా చాటింది. ఆదాయం, పన్నుల వసూలు, సర్వే పనుల్లో మాత్రం అధికారుల తీరుతో వెనుకబాటు ఆందోళన కలిగిస్తోంది. అన్ని విభాగాలను క్రోడీకరించి ఇచ్చిన కీలక పనితీరు సూచిక(కేపీఐ)లో జిల్లా 95 పాయింట్లతో ఏ+ గ్రేడ్‌ సాధించింది. రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది.

  • ఉపాధి పనుల్లో నంబర్‌ వన్‌ :

  • ఉపాధి నిధుల వ్యయంలో జిల్లా ముందంజలో ఉంది. జిల్లాకు రూ.871.69 కోట్లు విడుదల కాగా, రూ. 706.05 కోట్లు ఖర్చు చేసి 81 శాతం ప్రగతి చూపించింది. పశువుల నీటి తొట్ల నిర్మాణంలో 402 లక్ష్యం కాగా, ఏకంగా 832 పూర్తి చేసి 207 శాతం ప్రగతితో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఉద్యాన తోటల పెంపకంలో 2,600 ఎకరాల లక్ష్యానికి ఏకంగా 3,536 ఎకరాల్లో(136శాతం) మొక్కలు నాటి సత్తా చాటింది. పశువుల షెడ్ల నిర్మాణంలో 872కి గాను 852 (98 శాతం), సీసీ రోడ్ల నిర్మాణంలో 255 కిలోమీటర్లకి 240 కిలోమీటర్లు(94 శాతం), వ్యవసాయ చెరువుల (ఫారంపాండ్స్‌) నిర్మాణంలో 8వేలకు గాను 7117(89 శాతం), వ్యక్తిగత సోక్‌ పిట్స్‌ నిర్మాణంలో 11,499 కి గాను 9,189 (80 శాతం) లక్ష్యాన్ని సాధించి జిల్లా అద్భుత ప్రదర్శన కనబరిచింది.

  • పేదల ఇళ్ల నిర్మాణంలో టాప్‌-4

  • పీఎం ఆవాస్‌ యోజన కింద పేదల ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం 67,151 ఇళ్లకుగాను 54,790 పూర్తి చేసి 82 శాతం ప్రగతి సాధించింది. ఈ ఏడాది ఉగాది నాటికి 3,021 ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే 2,785 (92 శాతానికి పైగా) పూర్తి చేసి శభాష్‌ అనిపించుకుంది.

  • తల్లికి వందనం - మాతాశిశు ఆరోగ్యం :

  • తల్లికి వందనం పథకంలో జిల్లాలో 2,64,771 మంది అర్హులుగా అంచనా వేయగా, భారీగా 3,10,258 మంది విద్యార్థులు నమోదయ్యారు. అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం నాణ్యత పంపిణీలో 83 శాతం మంది సానుకూలత చూపడంతో జిల్లా 6వ ర్యాంకు సాధించింది. మూడేళ్లలోపు చిన్నారుల పౌష్టికాహారం నాణ్యతపై కూడా 84.4 శాతం సంతృప్తి (6వ ర్యాంక్‌) వ్యక్తమైంది. పీఎం పోషణ్‌ కింద 98.77 శాతం విద్యార్థులు భోజనం చేస్తూ రాష్ట్రంలో జిల్లా 5వ స్థానంలో నిలిచింది.

  • మౌలిక వసతులు - బీసీ, గిరిజన సంక్షేమం..

  • బీసీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో ఎస్‌బీఎం మరుగుదొడ్ల నిర్మాణంలో కర్నూలు, పార్వతీపురం మన్యం జిల్లాలతోపాటు శ్రీకాకుళం రాష్ట్రంలోనే బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ జిల్లాగా నిలిచింది. బీసీ భవన్‌ నిర్మాణానికి జిల్లాలో స్థలం సిద్ధంగా ఉందని నివేదిక తెలిపింది. సంకల్పం (పీఎం-అజయ్‌-ఉన్నతి) పథకం కింద జిల్లాలో 137 మంది లబ్ధిదారులకు రూ.1.82 కోట్లతో ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 92 యూనిట్లు పూర్తయ్యాయి. ట్రైకార్‌-ఉన్నతి పథకం కింద 109 మందికి ఆర్థిక సాయం అందుతోంది. పీఎం జన్మన్‌ కింద జిల్లాకు మంజూరైన 27 అంగన్‌వాడీ భవనాలకు రూ.3.24 కోట్లు విడుదల కాగా, ఆ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా.. జిల్లాలో మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ మౌలిక వసతుల కోసం రూ.17.48 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

  • ఆదాయం, పన్ను వసూళ్లలో డీలా :

  • జిల్లాలో పనుల వసూళ్ల పరిస్థితి ఆశాజనకంగా లేదు. పంచాయతీ రాజ్‌ పన్నుల(స్వర్ణ పంచాయత్‌) కింద రూ.34.36 కోట్ల డిమాండ్‌ ఉండగా, రూ. 24.08 కోట్లు(70.08శాతం) మాత్రమే వసూలయ్యాయి. మునిసిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్‌ మదింపు, డిమాండ్‌ పెంపు లక్ష్యం రూ.46 కోట్లు కాగా.. రూ. 3.72 కోట్లు (81.3శాతం) వసూలు చేసి 11వ ర్యాంకులో నిలిచింది. ఎక్సైజ్‌(మద్యం) ఆదాయం లక్ష్యసాధనలో జిల్లా వెనుకబడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1215.47 కోట్ల లక్ష్యానికిగాను రూ. 1028.57 కోట్లు (85శాతం) రాబట్టి రాష్ట్రంలో 22వ స్థానానికి పరిమితమైంది. అమ్మకాల విలువ, ఆదాయం రెండింటిలోనూ ప్రతికూల వృద్ధి నమోదు కావడం గమనార్హం.

  • స్వమిత్వ సర్వేలో అట్టడుగున

  • గ్రామాల్లోని ఆస్తుల మ్యాపింగ్‌ కోసం ప్రభుత్వం చేపట్టిన ‘స్వమిత్వ’ సర్వేలో సిక్కోలు.. రాష్ట్రంలోని బాటమ్‌-5 జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. మొత్తం 496 గ్రామాలకుగాను కేవలం 291 (59 శాతం) గ్రామాల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇంకా 205 గ్రామాలు పెండింగ్‌లో ఉన్నాయి.

  • పడిపోతున్న భూగర్భ జలాలు...

  • రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు సన్నద్ధం కావాల్సి ఉంది. జిల్లాలో భూగర్భజలాలు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ ఫిబ్రవరి నాటికి 2.60 మీటర్లు కిందకు పడిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో సగటున 7.04 మీటర్ల లోతులో నీరు లభిస్తుండగా, 23.29 టీఎంసీల గ్రౌండ్‌ వాటర్‌ అందుబాటులో ఉంది. మునిసిపాలిటీల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక కింద మరమ్మతులు, ఇతర పనుల కోసం రూ.87.40 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో రోజుకొకసారి నీటి సరఫరా జరుగుతుండగా, ఇచ్ఛాపురంలో రెండు రోజులకోసారి తాగునీరు అందుతోంది.

  • ప్రీ-స్కూల్‌ పిల్లల వసతులపై అసంతృప్తి..

  • అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్‌(3-6 ఏళ్లు) పిల్లలకు గుడ్డు, పాలు పంపిణీపై 23.8 శాతం మంది, మరుగుదొడ్ల నిర్వహణపై 30.6 శాతం మంది ప్రతికూల అభిప్రాయాన్ని వెల్లడించారు. జిల్లాలోని అంగన్‌వాడీల్లో ఇంకా 328 కేంద్రాలకు పైపుల ద్వారా తాగునీటి కనెక్షన్‌ అందాల్సి ఉంది. 76 కేంద్రాలకు మరుగుదొడ్లు లేవు.

  • పీఎం జన్మన్‌ ఇళ్ల నిర్మాణంలో జాప్యం

  • గిరిజనుల కోసం ఉద్దేశించిన ‘పీఎం జన్మన్‌’ ఇళ్ల నిర్మాణంలో జిల్లా వెనుకబడింది. జిల్లాకు 1,534 ఇళ్లు మంజూరు కాగా కేవలం 231 ఇళ్లు(15 శాతం) మాత్రమే పూర్తయ్యాయి. 882(57శాతం) ఇళ్లకు గ్రౌండింగ్‌ జరగ్గా, ఇంకా 652 ఇళ్లు అసలు ప్రారంభమే కాలేదు. ఈ లోపాలను అధిగమించి, ఉపాధి పనుల్లో మాదిరి అన్నిశాఖల్లోనూ జోరు చూపిస్తే.. సిక్కోలు మరింత ప్రగతి సాధించే అవకాశం ఉందని కలెక్టర్ల సదస్సు నివేదిక స్పష్టం చేస్తోంది.

  • రోడ్డు భద్రతలో ‘సిక్కోలు’ భేష్‌!

  • రోడ్డు ప్రమాదాల నియంత్రణలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చేపట్టిన నివారణ చర్యలు, వాహనదారుల్లో పెరుగుతున్న అవగాహన సత్ఫలితాలనిచ్చాయి. విజయవాడలో గురువారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫెరెన్స్‌లో ముఖ్యమంత్రి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల కట్టడిలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు వెల్లడైంది.

  • గతేడాదితో పోలిస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. 2024లో జిల్లావ్యాప్తంగా 889 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 2025లో ఈ సంఖ్య 710కి పరిమితమైంది. ఏకంగా 20.1 శాతం మే ప్రమాదాలు తగ్గుముఖం పట్టి జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో శ్రీకాకుళం తర్వాత స్థానాల్లో ఎన్టీఆర్‌(-16.6శాతం), గుంటూరు (-13.0శాతం), ప్రకాశం (-12.6 శాతం) జిల్లాలు ఉన్నాయి.

  • తగ్గిన మరణాల రేటు..

  • ప్రమాదాల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య కూడా తగ్గడం ఊరటనిస్తోంది. 2024లో జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా 281 మంది ప్రాణాలు కోల్పోగా, 2025లో ఆ సంఖ్య 264కు తగ్గింది. మరణాల రేటులో 6.0 శాతం మేర క్షీణత నమోదైంది. బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు, నిరంతర తనిఖీలు, ట్రాఫిక్‌ నిబంధనల అమలు వల్లే ఈ మార్పు సాధ్యమైందని స్పష్టమవుతోంది.

  • ఆ జిల్లాల్లో డేంజర్‌ బెల్స్‌..

  • ప్రమాదాల కట్టడిలో శ్రీకాకుళం, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆదర్శంగా నిలవగా.. కర్నూలు (21.9 శాతం), ఏలూరు (20.5శాతం), తూర్పుగోదావరి (15.6శాతం) జిల్లాల్లో ప్రమాదాలు అత్యధికంగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఇక మరణాల రేటులో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏకంగా 61.2 శాతం, కోనసీమలో 33.2 శాతం, కృష్ణాలో 21.1 శాతం మేర పెరుగుదల నమోదు కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సదస్సులో అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Updated Date - Mar 13 , 2026 | 12:27 AM