Share News

టమాటా రైతు కుదేలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:26 AM

అకాల వర్షం టమాటా రైతును నిలువునా ముంచేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పంట నీటమునిగింది.

టమాటా రైతు కుదేలు
జింకిభద్రలో నీటమునిగిన టమాటా

- వర్షానికి నీట మునిగిన పంట

- వందల ఎకరాల్లో నష్టం

సోంపేట, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షం టమాటా రైతును నిలువునా ముంచేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వందల ఎకరాల్లో పంట నీటమునిగింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలోని బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, లక్కవరం, బారువ తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో రైతులు టమాటాను సాగు చేస్తున్నారు. అయితే, వర్షానికి బెంకిలిలో 123మంది రైతులకు చెందిన 200ఎకరాలు, జింకిభద్రలో 148మంది రైతులకు చెందిన 126ఎకరాలు, పలాసపురంలో 42మంది రైతులకు చెందిన 50ఎకరాల పంట నీట మునిగింది. బారువ, మండపల్లి, అమ్మవారిపుట్టుగ, బంజిరి నారాయణపురం, బెల్లుపడ, కుత్తుమ తదితర గ్రామాల్లో కూడా టమాటాకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. దెబ్బతిన్న పంటను వ్యవసాయశాఖాధికారులు బుధవారం పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని హర్టీకల్చర్‌ అధికారి మాధవీలత తెలిపారు. ఇప్పటికే ధర తగ్గి ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈ అకాల వర్షం మరింత నష్టం కలిగించిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:26 AM