టోల్ వడ్డింపు
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:33 AM
Toll fee increase జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులపై టోల్‌చార్జీల భారం పెరిగింది. ఈ నెల 1 నుంచి టోల్‌చార్జీలతోపాటు టోల్‌ప్లాజాల ఫాస్టాగ్ పాస్ వార్షిక ఫీజు పెరిగాయి.
రూ.5 నుంచి రూ.20 వరకు రుసుం పెంపు
ఫాస్టాగ్ వార్షిక పాస్‌పై రూ.75 అదనపు వసూలు
గగ్గోలు చెందుతున్న వాహనదారులు
నరసన్నపేట, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి):
జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులపై టోల్‌చార్జీల భారం పెరిగింది. ఈ నెల 1 నుంచి టోల్‌చార్జీలతోపాటు టోల్‌ప్లాజాల ఫాస్టాగ్ పాస్ వార్షిక ఫీజు పెరిగాయి. కారు, జీపు, మినీ బస్సులు, లారీలు, బస్సులు తదితర వాహనాలపై గతంలో కన్నా రూ.5 నుంచి రూ.20 వరకు టోల్‌చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్ వార్షిక పాస్ అమల్లోకి తెచ్చి ఏడున్నర నెలలు మాత్రమే కాగా.. ఆకస్మికంగా చార్జీలు పెంచడంపై వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం మధ్య నాలుగు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఇందులో నరసన్నపేట మండలం మడపాం, పలాస మండలం లక్ష్మీపురం, కంచిలి మండలం బెల్లుపడ వద్ద టోల్‌ప్లాజాలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్నాయి. నరసన్నపేట- పాతపట్నం మార్గంలో ఆర్లి వద్ద మరో టోల్‌ప్లాజా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఆర్‌డీసీ పరిధిలో కొనసాగుతోంది.
ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు నాలుగు టోల్‌ప్లాజాల వద్ద రుసుం చెల్లించాలి. పెంచిన ధరల కారణంగా.. గతం కన్నా ఇప్పుడు రూ.100 నుంచి రూ.150 వరకు అదనపు భారం పడుతోందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.
మడపాం టోల్‌ప్లాజా వద్ద రోజుకు సగటున 8 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మడపాం టోల్‌ప్లాజా వద్ద గతంలో కారు, జీపు, వ్యాన్‌లకు రూ.150 ఉండగా.. ప్రస్తుతం రూ.155కు పెంచారు. మినీబస్సులకు రూ.160 నుంచి రూ.165కు, బస్సులు, లారీలకు రూ.335 నుంచి రూ.345కు, త్రీయాక్సిల్ కమర్షియల్ వాహనాలకు రూ.530 నుంచి రూ.540కు చార్జీలు పెంచేశారు. అదనపు భారంతో ఇబ్బందులు పడుతున్నామని కమర్షియల్ వాహనదారులు పేర్కొంటున్నారు. టోల్ చార్జీలు పెరిగిన నేపథ్యంలో.. కమర్షియల్ వాహనాల అద్దెలు కూడా పెంచేశారని వాపోతున్నారు.
వార్షికపాస్‌పై రూ.75 పెంపు
ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు ఏడాదికి రూ.3వేలు చెల్లించాలి. ఈ వాహనాలు దేశంలో ఏ టోల్‌ప్లాజా నుంచైనా ఏడాదిలోపు 200 సార్లు ప్రయాణించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ రీచార్జ్‌ను కార్లు, జీపులకు, వ్యాన్‌లకు పరిమితం చేశారు. వాణిజ్య అవసరాలకు తిరిగే వాహనాలకు అవకాశం లేదు. ఈ వార్షిక ఫీజును సైతం రూ.3,075కు కేంద్రం పెంచేసింది. కనీసం 8 నెలలు కూడా కాకముందే పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రవాణాపై ప్రభావం
టోల్‌చార్జీలు పెంచడంతో నెలకు అదనంగా ఒక్కో లారీపై రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు భారం పడుతుంది. ఇప్పటికే రవాణా రంగం నష్టాల్లో ఉంది. ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రాయితీ కల్పించాలి. టోల్‌చార్జీలు తగ్గించాలి.
- రావాడ భాస్కరరావు, విజయదుర్గా లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు, నరసన్నపేట