నేటి విజేతలు.. రేపటి దేశ భవిష్యత్
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:04 AM
'Shining Stars' Awards for Students ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ను అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమ’ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
218 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పురస్కారాలు
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూలై 20(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ను అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమ’ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్‌లో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపిన 218 మంది విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు 187, ఇంటర్ విద్యార్థులు 31 మందికి మంత్రి చేతుల మీదుగా చెక్కులు, పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నేటి విజేతలే.. రేపటి దేశ భవిష్యత్. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. గతంలో జిల్లా ఉత్తీర్ణత 82.41శాతంతో 14వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 90.60 శాతానికి పెరిగి 5వ స్థానానికి చేరుకోవడం హర్షణీయం. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో 106 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డులు పొందడం గర్వకారణం. ఇందులో 66 శాతం మంది బాలికలే ఉండడం విశేషం. యువతకు చదువుతో పాటు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. రాబోయే రోజుల్లో 20లక్షల ఉద్యోగాలను అందించాలనే లక్ష్యంతో సుమారు ఆరుగురు మంత్రులతో ప్రత్యేక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యువతకు అంతర్జాతీయంగా మరిన్ని అవకాశాలు కల్పించేలా రష్యా వంటి దేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక శిక్షణ, మద్దతు అందిస్తామ’ని తెలిపారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ‘జిల్లాలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, అఽధికారులు నిరంతరం కృషి చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న అద్భుత విజయాలను జూనియర్ విద్యార్థులకు కూడా వివరించి వారిలో స్ఫూర్తి నింపాలి. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించేందుకు ఈ నెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల’ని పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేలా పాఠశాలల్లో క్రమశిక్షణను నేర్పుతున్నామన్నారు. ఎచ్చెర్ల, నరసన్నపేట, పాతపట్నం ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు తదితరులు ప్రసంగించారు. ఉపాధ్యాయుల ప్రత్యేక బోధనతో తాము ఈ ఫలితాలు సాఽధించామని సత్కారం పొందిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈవో రవిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠల్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, మొదలవలస రమేష్, పీఎంజే బాబు, అధికారులు పాల్గొన్నారు.