నేడు ఆదిత్యుడి తెప్పోత్సవం
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:07 AM
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం (హంస నావికోత్సవం) శనివారం ఇంద్రపుష్కరిణిలో కన్నుల పండువగా జరుగనుంది.
స్వర్ణాభరణాలంకరణలో దర్శనమివ్వనున్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి
అరసవల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం (హంస నావికోత్సవం) శనివారం ఇంద్రపుష్కరిణిలో కన్నుల పండువగా జరుగనుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు నిద్రలోకి జారుకుని, మరలా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. అందుకే ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. పవిత్ర కార్తీక మాసంలో, హరిహరులకు అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర దినాన్ని హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహి స్తారు. ఏకాదశి మరుసటి రోజున వచ్చే ద్వాదశి నాడు స్వామివారు బృందా వన విహారానికి వెళతారు. అందుకే ప్రత్యేకంగా అలంక రించిన హంసనావపై సూర్యనారాయణ స్వా మివారిని, శ్రీఉష, ఛాయ, పద్మిని సమేత దేవే రులతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. అనంతరం ఆలయ ఇంద్రపుష్కరిణిలో 12సార్లు ప్రదక్షిణలు చేయిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులకు తి రువీధి నిర్వహిస్తారు. తరువాత స్వామివారిని ఆలయ అనివెట్టి మండపంలో ఉంచి క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, వహాదాశీర్వచనములు, తులసీ మహాలక్ష్మి పూజ, విశేష హారతులు నిర్వహిస్తారు. ఈ పవిత్రం రోజు న ఆలయంలో సూర్యనారాయణ స్వామివారిని బంగారు ఆభరణాలతో విశేషంగా అలంకరిస్తారు. ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించి భక్తులు పులకితులవుతుంటారు. ఈ మేరకు ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంద్రపుష్కరిని పునర్మిర్మాణ పనులు జరుగుతున్నా సరే, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి, పుష్కరిణిలో నీటిని నింపి సిద్ధం చేశారు. ఇప్పటికే ఇంద్ర పుష్కరిణిలో నావతో ట్రయల్ నిర్వహించారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ హంసనావికోత్సవం (తెప్పోత్సవం) ప్రారంభమవుతుంది.