స్వశక్తితో ఎదిగేలా..
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:05 AM
Distribution of assistive devices to persons with disabilities ‘దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేలా.. ఆత్మగౌరవంతో జీవించేలా అవసరమైన ప్రతిసాయాన్ని అందిస్తాం. అండగా ఉంటామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో 230 మంది దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.
దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
230 మందికి ఉపకరణాల పంపిణీ
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేలా.. ఆత్మగౌరవంతో జీవించేలా అవసరమైన ప్రతిసాయాన్ని అందిస్తాం. అండగా ఉంటామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో 230 మంది దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నిధులు రూ.1.50కోట్లతో, ఆలింకో భాగస్వామ్యంతో 130 బ్యాటరీ ట్రైసైకిళ్లు, 100 జాయ్‌స్టిక్ వీల్‌చైర్లను అందజేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలను శతశాతం పంపిణీ చేస్తాం. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికే కలెక్టరేట్‌లో ప్రతి మూడో శుక్రవారం స్వాభిమాన్ పేరిట ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. దీనిద్వారా ఇప్పటికే సుమారు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామ’ని తెలిపారు. అలాగే అరసవల్లి, శ్రీకూర్మం దేవాలయాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు తీసుకురావడంతోపాటు నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘కేంద్రమంత్రి చొరవతో జిల్లాలో దివ్యాంగులకు మెరుగైన సాయం అందిస్తున్నాం. 2021 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో మొత్తం రూ.7.98 కోట్ల ఖర్చుతో 2,313 మందికి 4,491 సహాయ పరికరాలను అందించాం. కలెక్టరేట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులు సులభంగా తిరిగేలా ర్యాంప్‌లు, లిప్ట్‌లు ఏర్పాటు చేశామ’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు, పేదలపై నాడు ఎర్రన్న చూపిన ఆప్యాయతను.. నేడు ఆయన తనయుడు రామ్మోహన్‌నాయుడు కొనసాగించడం అభినందనీయమన్నారు. కేంద్రమంత్రి, కలెక్టర్ సమన్వయంతో జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిప్రత్యూష, ఆలింకో ప్రతినిధులు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ మేనేజర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.