‘దీక్ష’తో చదివేలా..
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:39 AM
విద్యారంగాన్ని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా పిల్లలను సాంకేతికతకు చేరువచేసి, ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం దీక్ష యాప్‌ను ప్రవేశపెట్టింది.
- పాఠశాల విద్యార్థులకు వరంగా దీక్ష యాప్
- అధికారిక లెర్నింగ్ ప్లాట్‌ఫామ్
- విశేష ఆదరణ పొందుతున్న ఆధునిక సాంకేతికత
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యారంగాన్ని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా పిల్లలను సాంకేతికతకు చేరువచేసి, ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం దీక్ష యాప్‌ను ప్రవేశపెట్టింది. చదువును సులభతరం చేసేందుకు రూపొందించిన అధికారిక లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఇది. రాష్ట్రంలో సుమారు 5.91 లక్షల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పాఠ్యపుస్తకాల్లో కఠినంగా అనిపించిన అంశాలను విద్యార్థులు స్వయంగా అర్థం చేసుకునేలా ఈ యాప్ సహకరిస్తుంది. జిల్లాలో 2,616 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,015 ప్రాథమిక, 151 ప్రాథమికోన్నత, 450 ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది 1,53,918 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా దీక్ష యాప్‌ను వినియోగించుకోవచ్చు.
సందేహాల నివృత్తి
విద్యార్థులు బడికి హాజరుకాని రోజుల్లో చెప్పిన పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేలా ఈ యాప్‌ను రూపకల్పన చేశారు. ఇందులో 6 వేల పాఠ్యపుస్తకాలు, ఆడియోలు, వీడియోలు, ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక అవసరాల కలిగిన పిల్లల కోసం 3వేలకు పైగా ఆడియో పాఠాలు, 10వేల పదాలను సైతం ఇందులో నిక్షిప్తం చేశారు. విద్యార్థులు తమ అర్థంకాని పాఠ్యాంశాలకు సంబంధించి ఇందులోని ఏఐ ఫీచర్ ద్వారా సమాధానాలు రాబట్టుకోవచ్చు. పాఠాలను చదివి వినిపించే టెక్ట్స్ టు స్పీచ్ సౌకర్యం కూడా ఉంది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు..
స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్ చేసి భాష, తరగతి, బోర్డును ఎంచుకోవాలి. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో మొదటి క్యూర్ కోడ్ ముద్రించి ఉంటుంది. స్మార్ట్ ఫోన్‌లో దీక్షయాప్‌ను ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే సంబంధిత పాఠానికి సంబంధించి 2డీ, 3 డీ యానిమేషన్ వీడియోలు కనిపిస్తాయి. అదే విధంగా సైన్స్ పాఠాలకు సంబంధించి వర్చువల్ ల్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లోనే విద్యార్థులు ప్రయోగాలు చేయవచ్చు. పాఠం పూర్తయ్యాక ఎంత వరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఇంటరాక్టివ్ క్విజ్‌లు, ప్రాక్టీస్ ప్రశ్నలు అందుబాటులో ఉంటాయి.
వినియోగం ఇలా
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అధ్యయనం చేయాలనుకున్న అంశాలతో పోర్టల్ వస్తుంది. దేశంలోని 18 భాషలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఒక్కటి ఎంచుకోవాలి. అనంతరం ప్రాంతాన్ని ఎంచుకుంటే ఆ ప్రాంతాల్లోని పాఠశాలలను చూపుతుంది. తరువాత ఏ తరగతి చదువుతున్నారో సబ్మిట్ కొట్టాలి.
ఇంటర్నెట్ లేకపోయినా ..
గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకోని ఈ యాప్‌లో ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ సదుపాయం కల్పించారు. నెట్‌వర్క్ ఉన్నప్పుడు వీడియోలు గానీ, వర్స్‌షీట్లను గానీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ తర్వాత డేటా లేదా ఇంటర్నెట్ లేకపోయినా సులభంగా చూసుకోవచ్చు.
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం
దీక్ష యాప్‌పై విద్యార్థులకు అవగాహన పెంచేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయుల ద్వారా సైన్సు పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నాం. ఇంగ్లీషు, సాంఘీక శాస్త్రం సబెక్టులపై పరిజ్ఞానం పెంపొందించేందుకు ఈయాప్ దోహదపడుతుంది.
-ఎ.రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం