సాగునీటి కష్టాలు తొలగించేలా..
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:34 PM
Proposals for the Seedi Lift Irrigation Scheme ‘వ్యవసాయాధారితమైన జిల్లాలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమివ్వనున్నాం. సాగునీటి కష్టాలు తొలగించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు సీది ఎత్తిపోతల పథకానికి రూ.32.20కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించి నివేదిక సిద్ధం చేశాం. సీది ఎత్తిపోతల పథకం ఏర్పాటుతో పాతపట్నం, హిరమండలం మండలాల పరిధిలో 11 గ్రామాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుంద’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
రూ.32.20 కోట్లతో సీది ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు
11 గ్రామాల్లో 3,850 ఎకరాల ఆయకట్టుకు మేలు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కాలినడకన.. క్షేత్రస్థాయిలో పరిశీలన
పాతపట్నం/ హిరమండలం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘వ్యవసాయాధారితమైన జిల్లాలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమివ్వనున్నాం. సాగునీటి కష్టాలు తొలగించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు సీది ఎత్తిపోతల పథకానికి రూ.32.20కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించి నివేదిక సిద్ధం చేశాం. సీది ఎత్తిపోతల పథకం ఏర్పాటుతో పాతపట్నం, హిరమండలం మండలాల పరిధిలో 11 గ్రామాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుంద’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం పాతపట్నం మండలం సీది గ్రామ సమీపాన మహేంద్రతనయ నదీ తీరాన ఎత్తిపోతల పథకం నిర్మాణానికిగానూ క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. కిలోమీటరు మేర మండుటెండలో సైతం నడిచారు. సీది గ్రామ శివారులో గుమ్మగెడ్డ చేరువ నుంచి కారు వెళ్లే అవకాశం లేదు. కొంతదూరం బైక్‌పై ప్రయాణం సాగింది. అక్కడ నుంచి బైక్ కూడా వెళ్లే అవకాశం లేదు. దీంతో ఎండలో పొలాల గట్లపైనా.. తోటల మధ్య సుమారు కిలోమీటరు పరిధిలో ఉన్న మహేంద్రతనయ నది వరకు నడక సాగించారు. అధికారులతోపాటు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘సీది ఎత్తిపోతల పథకం ద్వారా పాతపట్నం మండలంలో సీది, తామర, పిట్టలసరియాపల్లి, మాకివలస, రౌతుపురం, పెద్దసున్నాపురం, రొంపివలస, నల్లకొత్తూరు, పాశిగంగుపేట, బైదలాపురం గ్రామాలతోపాటు, హిరమండలం మండలంలోని కల్లట గ్రామంలో 3849.47 ఎకరాలకు సాగునీరు అందనుంద’ని తెలిపారు. అలాగే మెళియాపుట్టి మండలంలో 580 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకుగానూ.. కొసమాళలో రూ.4.16 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికిగానూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు ఇరిగేషన్ శాఖ ఈఈ ఎం.కామేశ్వరరావు తెలిపారు.
వర్షాకాలం ముందే పనులు పూర్తిచేయాలి
హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్‌లో నీటిని నింపేందుకు అనుసంధానంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బ్యారేజీ సెంటర్ సమీపంలో ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించారు. రిజర్వాయర్ నుంచి ఉద్దానం తాగునీటి సరఫరా చేసే పైపులైన్లు మరమ్మతులకు గురికాకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఒకవేళ పైపులైన్లు తొలగించాల్సి వస్తే ముందుగానే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ ‘ఎత్తిపోతల పథకం పనులు 55 శాతం జరిగాయి. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం వరకు నీటి సరఫరా చేసేందుకు మెయిన్ పైప్‌లైన్ల నిర్మాణానికి మరో 2నెలల సమయం పడుతుంది. ఈ పథకానికి విద్యుత్ సరఫరాకు సంబంధించి ఆరు నెలల్లోపు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తాం. ఎత్తిపోతల పథకం పరిధిలో భూసేకరణ, పునరావాస సమస్యలపై ఎప్పటికప్పుడు ట్రాన్స్‌కో, రెవెన్యూ, వంశధార అధికారులతో చర్చిస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తాం. ఇది ఒక గ్రీన్ ప్రాజెక్టు. ఈ రిజర్వాయర్‌లో 12 నుంచి 15టీఎంసీల నీటి నిల్వ చేయవచ్చు. ఇక్కడ నుంచి రెండు తాగునీటి పథకాలకు నిరంతరాయంగా నీటిని అందించవచ్చు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు నియోజకవర్గానికి కొత్తగా జలజీవన్ పథకంలో భాగంగా పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలకు తాగునీటిని అందించవచ్చు. రెండు పంటలు కూడా పండించుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ ప్రాంతం ఏకోటూరిజంగా అభివృద్ధి చేస్తామ’ని తెలిపారు. కార్యక్రమంలో వంశధార ఈఈ బి.రవీంద్ర, డీఈఈలు నాగేశ్వరరావు, రామకృష్ణ, సాయిరామకృష్ణ, అనిల్, జేఈఈలు ఉన్నారు.