జల్సాలకు డబ్బు సంపాదించాలని..
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:40 PM
Three people, including two minors, arrested పలాసలోని బత్తులవీధికి చెందిన మల్లా ప్రేమకుమారి అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లు సహా ముగ్గురిని అరెస్టు చేశామని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌సహబాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వృద్ధురాలి ఇంట్లో చోరీకి స్కెచ్
ఇద్దరు మైనర్లు సహా ముగ్గురి అరెస్టు
పలాస, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): పలాసలోని బత్తులవీధికి చెందిన మల్లా ప్రేమకుమారి అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లు సహా ముగ్గురిని అరెస్టు చేశామని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌సహబాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘పలాస మండలం శాసనం గ్రామానికి చెందిన మంగి గణేష్.. ఓ బాలికతో స్నేహాన్ని పెంచుకున్నాడు. త్వరలోనే వీరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. జల్సాలు చేయడానికి, సులభంగా డబ్బులు సంపాదించడానికి చోరీలకు స్కెచ్ వేశారు. దొంగతనం చేసి డబ్బులు, బంగారం పోగుచేసుకోవడానికి ఆ బాలిక తమ్ముడు సహాయం తీసుకున్నారు. ఈ క్రమంలో బత్తులవీధిలో నివసిస్తున్న వృద్ధురాలు మల్లా ప్రేమకుమారి దైనందిన జీవనాన్ని గుర్తించి ఆమెను టార్గెట్ చేశారు. ఆమెకు శనివారం మధ్యాహ్నం మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి తాగించారు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఇనుప పెట్టెలో ఉన్న రూ.2.50 లక్షల నగదు, అరతులం బరువు ఉండే ముక్కుపుడకలు, చెవిదిద్దులు దొంగిలించారు. కొంతసమయం తర్వాత అపస్మారకస్థితిలో ఉన్న వృద్ధురాలిని స్థానికులు గుర్తించారు. ఇంట్లో సామ్రగి చెల్లాచెదురుగా ఉండడంతో చోరీ జరిగిందని భావించారు. కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసి వారి సహాయంతో వృద్ధురాలిని చికిత్స నిమిత్తం పలాసలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత సీఐ వై.రామకృష్ణ.. ఆదివారం ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని.. అనుమానితులను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లతోపాటు.. దొంగతనానికి పథకం వేసిన మంగి గణేష్‌ను సోమవారం అరెస్టు చేశామ’ని డీఎస్పీ షేక్‌సహబాజ్ అహ్మద్ తెలిపారు. చోరీ సొత్తు రికవరీ చేసి.. వారిని పలాస కోర్టులో హాజరుపరిచామన్నారు. ఒక్కరోజులో కేసు మిస్టరీని చేధించిన కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.