Share News

ప్రాథమిక దశలోనే కిడ్నీవ్యాధి గుర్తించేలా

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:56 PM

Biomarker tests at KGH కిడ్నీవ్యాధి నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాధి మూలాలు ప్రాథమిక దశలోనే గుర్తించేలా బయోమార్కర్‌ పరీక్షలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రాథమిక దశలోనే కిడ్నీవ్యాధి గుర్తించేలా
పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రి..

కేజీహెచ్‌లో బయోమార్కర్‌ పరీక్షలు

ఫలిస్తున్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు

పలాస, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): కిడ్నీవ్యాధి నివారణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాధి మూలాలు ప్రాథమిక దశలోనే గుర్తించేలా బయోమార్కర్‌ పరీక్షలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పద్మనాభపురం సమీపంలో కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రిలో ఇప్పటికే కిడ్నీ బాధితులకు నెఫ్రోప్లస్‌, డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. ఈ ఆసుపత్రిలో ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా విజయవంతమైంది. మరోవైపు జార్జి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ అనే ప్రైవేటు వైద్య సంస్థ ద్వారా కూడా గత రెండేళ్ల నుంచి కిడ్నీ మూలల కోసం అన్వేషణ జరుగుతోంది. ప్రముఖ నెఫ్రాలజిస్టు, కిడ్నీ వ్యాధులపై అధ్యయనం చేస్తున్న విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ రవిరాజ్‌ బృందానికి కూడా మూలాలు కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన విషయం విధితమే. వారి పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తుండడంతో వ్యాధి మూలకారకాలపై చర్యలు చేపట్టారు. బయోమార్కర్‌ పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధి బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన మందులు ఇస్తే పూర్తిగా కోలుకోవడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణుల బృందం నిర్ధారించింది. ఇప్పటికే ఇటువంటి పరీక్షలు సత్ఫలితాలు ఇస్తుండడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం కేజీహెచ్‌లో బయోమార్కర్‌ పరీక్షలు చేయడానికి ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. అందులో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందం, వైద్యనిపుణులు పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలో 1500 మంది రక్తనమూనాలు ఇప్పటికే సేకరించారు. మొత్తం ఫలితాలు వచ్చిన తరువాత ఉద్దానం గ్రామాల్లో కిడ్నీ బారిన పడే అవకాశం ఉన్న వారికి ప్రత్యేకంగా గుర్తించి తగు రక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఫలితాలు సంతృప్తికరంగా సాగితే ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నిర్మూలన సాధ్యమయ్యే అవకాశం ఉంది.

Updated Date - Apr 18 , 2026 | 11:56 PM