Share News

నీరు కొనేందుకు.. నెలకు రూ.2వేలు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:06 AM

Water problem In Palasa Hadko Colony సాధారణంగా వేసవి వచ్చిందంటే తాగునీటి సమస్యలు అనేక ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఆ కాలనీలో మాత్రం వర్షాకాలంలో కూడా తాగునీటికి ఇబ్బందులే. ఇదీ పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ హడ్కోకాలనీ వాసుల దుస్థితి.

నీరు కొనేందుకు.. నెలకు రూ.2వేలు
కొనుగోలు చేసిన నీటిని డ్రమ్ములు, బకెట్లలోకి నింపుతున్న హడ్కోకాలనీ మహిళ

  • పలాస హడ్కోకాలనీలో చుక్కనీరు వస్తే ఒట్టు

  • ప్రైవేటు ట్యాంకర్ల వద్ద కొనుగోలు చేస్తున్న ప్రజలు

  • వృథాగా ఎన్టీఆర్‌ శుద్ధజలాల పథకం

  • పలాస, జనవరి 28(ఆంధ్రజ్యోతి): సాధారణంగా వేసవి వచ్చిందంటే తాగునీటి సమస్యలు అనేక ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఆ కాలనీలో మాత్రం వర్షాకాలంలో కూడా తాగునీటికి ఇబ్బందులే. ఇదీ పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ హడ్కోకాలనీ వాసుల దుస్థితి. ఈ కాలనీలో సుమారు వంద ఇళ్లు ఉన్నాయి. కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ బోర్లు 600 అడుగుల లోతు వరకు వేసినా.. నీరు పడుతుందో లేదో తెలియని దుస్థితి. దీంతో ఈ ప్రాంతవాసులు బోరుబావులు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మునిసిపాలిటీ పబ్లిక్‌ కుళాయిలు ఉన్నా ఎత్తయిన ప్రాంతం కావడంతో నీరు రావడం గగనమే. తాగునీటి సమస్య పరిష్కరించాలని మునిసిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఒక్కో డ్రమ్ము నీటిని రూ.50కి కొనుగోలు చేస్తున్నారు. ప్రతినెలా ఒక్కో ఇంటికి నీటికోసం రూ.2వేల వరకు ఖర్చువుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల్లో నేతలు నీటి సమస్యపై హామీ ఇస్తున్నారని పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు.

  • 2019 సంవత్సరం వరకూ టీడీపీ పరిపాలనలో రూ.2లకే 20 లీటర్ల శుద్ధ జలాలలను అందించేందుకు ఇక్కడ ట్యాంకును ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పథకం నిర్వహణ పట్టించుకోలేదు. దీంతో శుద్ధజలాల ట్యాంకు నిరుపయోగంగా మారింది. జలజీవన్‌ మిషన్‌ ద్వారా మునిసిపాలిటీకి తాగునీటి సమస్య పరిష్కారమైనా ఉద్దానం పథకం జలాలు ఇక్కడకు పూర్తిగా అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హడ్కోకాలనీ వాసులు కోరుతున్నారు.

  • సమస్య పరిష్కరిస్తాం:

  • హడ్కోకాలనీలో తీవ్ర నీటిసమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. ప్రజలు తాగునీటికే డబ్బులు వెచ్చిస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేస్తాం. కుళాయిల ద్వారా నీరు వచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం.

  • ఇ.శ్రీనివాసులు, మునిసిపల్‌ కమిషనర్‌, పలాస-కాశీబుగ్గ

Updated Date - Jan 30 , 2026 | 12:06 AM