టిప్పర్ మట్టి రూ.13వేలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:14 AM
Soil excavations in Avadhanula pond సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి ఆనుకుని ఉన్న అవధానుల చెరువులో రాత్రివేళ మట్టి, కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గత మూడు నెలలు నుంచి నిత్యం లారీల్లో మట్టి, కంకరను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవధానుల చెరువులో దొంగలు
రాత్రివేళ యథేచ్ఛగా తవ్వకాలు
కంకర కూడా అక్రమ రవాణా
చోద్యం చూస్తున్న అధికారులు
సరుబుజ్జిలి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి ఆనుకుని ఉన్న అవధానుల చెరువులో రాత్రివేళ మట్టి, కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గత మూడు నెలలు నుంచి నిత్యం లారీల్లో మట్టి, కంకరను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం మండలం పల్లివలస, పొన్నాడ గ్రామాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ మట్టి దందాను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ‘అవధానుల చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి.. ఇటుకబట్టీల యాజమానులకు ఒక్కో టిప్పర్ లోడు మట్టిని సుమారు రూ.13వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా రోజూ పదుల సంఖ్యలో లోడ్లు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మట్టి, కంకర తవ్వకాల కారణంగా చెరువులు, కొండల జాగృతి మారిపోయి.. పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. అధిక లోడులతో మట్టి రవాణా కారణంగా పురుషోత్తపురం రోడ్డు గతుకులమయమైంది. వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే లారీల్లో మట్టిపై ఎటువంటి పరదాలు వేయకుండా.. తరలిస్తుండడంతో అలికాం- బత్తిలి మార్గంలో ప్రయాణికుల కళ్లలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయ’ని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల మట్టి రవాణాను అరికట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశించినా.. సచివాలయ సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, మైన్స్ అధికారులు మౌనం దాల్చడం అన్యాయమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి తరలిస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మట్టి, కంకర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ జగదీష్ వద్ద ప్రస్తావించగా.. మట్టి తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తామన్నారు. అక్రమంగా మట్టిని తవ్వి, తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.