అర్హులకు సకాలంలో రుణాల మంజూరు
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:00 AM
Banks play a crucial role in the district's development ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.
జిల్లా అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకం
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యసాధనపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల కింద రుణాల మంజూరుకు సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ పథకాల కోసం సమర్పించిన దరఖాస్తులను అఽధికారులు సకాలంలో బ్యాంకులకు పంపించాలని స్పష్టం చేశారు. ‘‘వంద మంది వ్యాపారవేత్తలు- రూ.100 కోట్లు’ కార్యక్రమంలో బ్యాంకర్ల పాత్ర ఎంతో కీలకం. వ్యవసాయ, హార్టికల్చర్, ఫిషరీష్, నాబార్డు, పశు సంవర్థక శాఖ, మెప్మా, అనుబంధ రంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి, మహిళా సాధికారత రంగాలకు అవసరమైన రుణాలను విస్తృతంగా అందించాలి. సోలార్ యూనిట్స్, తీరప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజీలు, ఆయిల్, ఫార్మసీ, బోర్‌వెల్స్ మొదలగు వాటికి రుణాలు మంజూరు చేయాలి. రుణాలపై సబ్సిడీ వివరాలను లబ్ధిదారులకు తెలియజేయాలి. వ్యవసాయానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు, పుట్టగొడుగుల ఉత్పత్తులు, పామాయిల్ సాగు, మొదలగు వాటిపై రైతులకు అవగాహన కల్పించాల’ని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, కన్వీనర్ విశ్వనాథ్, వ్యవసాయశాఖ, హార్టీకల్చర్, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, డీఆర్డీఏ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.