పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:26 PM
జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో... నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.శ్రీనివాసరావు తెలిపారు.
- తగాదాలకు అవకాశమివ్వకండి
-అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీనివాసరావు
హిరమండలం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో... నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం హిరమండలంలో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బందోబస్తు విధుల కోసం నియమించిన పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించునేలా సహకారం అందించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హిరమండలం మండల పరిధిలో 200 మంది సిబ్బందితో పాటు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం హిరమండలం మేజర్ పంచాయతీలో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను పిలిపించి వారితో అదనపు ఎస్పీ మాట్లాడారు. తగాదాలు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని వారిని కోరారు.
సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించండి
కోటబొమ్మాళి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులందరూ పోలీసులకు, అధికారులకు సహకరించాలని స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ కోరారు. స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులతో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్ధులందరికీ ఎన్నికల నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని వివరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, గొడవలకు తావివ్వద్దని కోరారరు. శాంతిభధ్రతలకు విఘాతం కలిగించకుండా ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అభ్యర్థులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కిల్లారి నారాయణరావు, తహసీల్దార్ చింతలపూడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
జలుమూరులో 94 మంది అభ్యర్థులు
జలుమూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో 40 పంచాయతీలకుగాను వెంకటాపురం, దరివాడ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 38 పంచాయతీలకు గాను 94 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పర్లాం పంచాయతీ సర్పంచ్ స్థానం కోసం అత్యధికంగా నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరో 16 పంచాయతీలకు ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నారు. ఇంకో 21 పంచాయతీల్లో ముఖాముఖి పోటీ జరుగుతోంది. మొత్తమ్మీద ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి.