Share News

‘స్థానిక’ ఎన్నికలకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:37 PM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భ ద్రతా చర్యలు చేపట్టడంతో పాటు నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి నిర్మూలన, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జట్టి ఎస్పీలకు సూచించారు.

‘స్థానిక’ ఎన్నికలకు పటిష్ట భద్రత
మాట్లాడుతున్న ఐజీ, పాల్గొన్న ఎస్పీ

- విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జట్టి

- ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భ ద్రతా చర్యలు చేపట్టడంతో పాటు నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి నిర్మూలన, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జట్టి ఎస్పీలకు సూచించారు. శనివారం ఆయన తన కార్యాలయం నుంచి రేంజ్‌ పరిధిలోని ఎస్పీలతో జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెండింగ్‌ హత్య కేసుల దర్యాప్తు, లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం, నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్ల అమలు, సైబర్‌ నేరాలు, స్మార్ట్‌ పోలీసింగ్‌ తదితర అంశాలపై జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే గుర్తించి భద్రతా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘటనలు, స్థానిక వివాదాలు, నేర చరిత్ర తదితర అంశాలపై దృష్టిసారించాలన్నారు. హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, ట్రబుల్‌ మేకర్లు ఇతర సమస్యాత్మక వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూఎస్‌ను ప్రత్యేక ప్రాధాన్యతతో అమలు చేయాలని ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాల సాగు, రవాణా, నిల్వ, విక్రయాలపై నిఘా పెట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పాట్‌ ప్రాంతాలను గుర్తించి ఇంజనీరింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, సిబ్బందికి స్పష్టమైన విధులు అప్పగించి సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లను ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే సందర్శించాలని అన్నారు. ఈ సమీక్షలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:37 PM