ఆ ఏడు గంటలూ.. బీభత్సమే!
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:30 AM
తితలీ తుఫాను సృష్టించిన విధ్వంసానికి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2018 అక్టోబరు 11న తెల్లవారు జామున ఉద్దానంపై విరుచుకుపడిన తుఫాను.. ఏడుగంటలపాటు పెనుగాలులు, భారీ వర్షంతో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.
తితలీ తుఫాన్ విధ్వంసానికి ఎనిమిదేళ్లు
భయం గుప్పిట్లో ఉద్దానం.. నిద్రలేని రాత్రులు
రైల్వేస్టేషన్ నుంచి జీడిపరిశ్రమల వరకు అపార నష్టం
పలాస, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): తితలీ తుఫాను సృష్టించిన విధ్వంసానికి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2018 అక్టోబరు 11న తెల్లవారు జామున ఉద్దానంపై విరుచుకుపడిన తుఫాను.. ఏడుగంటలపాటు పెనుగాలులు, భారీ వర్షంతో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రైల్వే వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. జీడిపరిశ్రమలు భారీగా నష్టపో యాయి. సహాయక చర్యల కోసం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పలాసలోనే మకాం వేశారు. ఆ తుఫాను నాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ఉద్దానం ప్రజలను వెంటాడుతున్నాయి.
ఏడు గంటలపాటు బీభత్సం
అక్టోబరు 11న తెల్లవారుజామున 2 గంటల తర్వాత మొదలైన పెనుగాలులు, భారీ వర్షం ఏడు గంటలపాటు బీభత్సం సృష్టించాయి. వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారథి సమీపంలో తీరాన్ని దాటిన తుఫాను పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలపై తీవ్ర ప్రభావం చూపింది. గంటకు 70 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జాతీయ రహదారిపై లారీలు బోల్తాపడ్డాయి. పలాస రైల్వే కాలనీలో వేలాది చెట్లు పడిపోయాయి. రేకుల ఇళ్లు కూలిపోవడంతో రైల్వే ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. పలాస రైల్వేస్టేషన్‌లో నాలుగు ప్లాట్‌ఫారాల పైకప్పులు ఎగిరిపోయాయి. రైళ్ల రాకపోకలను నియంత్రించే ప్యానల్ విభాగం ధ్వంసమైంది. వారం రోజులపాటు స్టేషన్ మూతపడగా.. 15 రోజుల వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జీడిపరిశ్రమలకు రూ.150 కోట్ల నష్టం
పలాస-కాశీబుగ్గలోని వందకుపైగా జీడిపరిశ్రమలు తుఫాను దెబ్బకు దెబ్బతిన్నాయి. రేకుల షెడ్లు ఎగిరిపోగా.. ముడిసరుకు, ఆరబెట్టిన జీడిపప్పు వర్షానికి తడిసిపోయాయి. ఒక్కో పరిశ్రమకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు వ్యాపారులు అంచనా వేశారు. మొత్తం నష్టం రూ.150 కోట్లకు పైగా ఉంటుందని భావించారు. కొందరు వ్యాపారులు ఇప్పటికీ ఆ నష్టాల నుంచి పూర్తిగా కోలుకోలేదు.
- పెనుగాలులు, భారీ వర్షానికి ఇళ్లు దెబ్బతిన్నాయి. గోడలు కూలి గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మొగిలిపాడు, కాశీబుగ్గ, చినబాడం తదితర ప్రాంతాల్లో రహదారులపై వరదనీరు నిలిచింది. మొగిలిపాడు సమీపంలో ఇనుప లోడుతో వెళ్తున్న మూడు లారీలు బోల్తాపడ్డాయి. ఆరు పెట్రోల్ బంకుల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. దుకాణాల హోర్డింగ్‌లు నేలకూలాయి.
- వజ్రపుకొత్తూరు మండల తీర ప్రాంతంలో జీడి, కొబ్బరి చెట్లు పెద్ద సంఖ్యలో నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటికీ ఇబ్బందులు ఎదురయ్యాయి. రాకపోకలు స్తంభించడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. తుఫాను దెబ్బకు 20 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని అప్పట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పలాస నుంచే సహాయక చర్యలు
తుఫాను తీవ్రతను గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పలాసలో మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఐదు రోజుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం అందించారు. విపత్తుల నివారణ సంస్థ అంచనాల ప్రకారం తితలీ తుఫానుతో సుమారు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది. పలాస, నందిగాం, టెక్కలి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. సుమారు 45 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలగా, భారీ విద్యుత్ టవర్ సైతం కూలిపోయింది.