ఆ లైట్లు ప్రాణాలు తీస్తున్నాయ్!
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:27 AM
జిల్లాలో వాహనాలకు ఎల్‌ఈడీ లైట్ల వినియోగం ఎక్కువైంది. ఈ లైట్లు అధిక కాంతి వెదజల్లుతుండడంతో వాహనాలకు ఇష్టారాజ్యంగా అమర్చేస్తోన్నారు.
-వాహనాలకు ఇష్టారాజ్యంగా ఎల్‌ఈడీల వినియోగం
- ఎదుటి వాహనచోదకుల కళ్లపై పడుతున్న లైట్ల ఫోకస్
- ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వైనం
- కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
ఏడాదిన్నర కిందట పైడిభీమవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖ నుంచి ద్విచక్ర వాహనంపై రాత్రిపూట ఇద్దరు వ్యక్తులు శ్రీకాకుళం వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనానికి చెందిన ఎల్‌ఈడీ లైట్ల వెలుతురు వారి కళ్లపై పడింది. దీంతో ఎదురుగాఏమీ కనిపించకపోవడంతో డివైడర్‌ను ఢీకొట్టి వంతెన కింద పడి ఇద్దరూ చనిపోయారు.
నాలుగు నెలల కిందట శ్రీకాకుళం నగరానికి చెందిన పండ్ల వ్యాపారి విశాఖపట్నం నుంచి రాత్రివేళ తన బుల్లెట్ వాహనంపై ఇంటికి వస్తుండగా చిలకపాలెం-అరిణాం అక్కివలస వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఎల్‌ఈడీ లైట్ల ఫోకస్ ఆయన కళ్లపై పడింది. దీంతో బుల్లెట్ అదుపు తప్పి బోల్తాపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శ్రీకాకుళంక్రైం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాహనాలకు ఎల్‌ఈడీ లైట్ల వినియోగం ఎక్కువైంది. ఈ లైట్లు అధిక కాంతి వెదజల్లుతుండడంతో వాహనాలకు ఇష్టారాజ్యంగా అమర్చేస్తోన్నారు. ద్విచక్ర వాహనాలు, లారీలు, బస్సులు, ఆటోలు ఇలా ప్రతి వాహనానికీ ఎల్‌ఈడీ లైట్లు దర్శనమిస్తోన్నాయి. వీటి కాంతి ఎదురుగా వచ్చే వాహనచోదకుల కళ్లపై పడుతుండడంతో వారికి ఏమి కనిపించక గందరగోళానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు. వాస్తవానికి కారుకు 75 వాట్స్, లారీకి 100 వాట్స్, ద్విచక్ర వాహనాలకు 10వాట్స్ లైట్లను వినియోగించాలనే నిబంధన ఉంది. కానీ, ఈ నిబంధనలను వాహనదారులు పట్టించుకోవడం లేదు. కొందరు ద్విచక్ర వాహనదారులు తమ వాహనానికి ఆరు నుంచి 8 ఎల్‌ఈడీ లైట్లను బిగిస్తున్నారు. గరిష్టంగా 70 వాట్ల మించిన ఫోకస్ లైట్లు వాడకూడదని నిబంధన ఉన్నా హైబీమ్ లైట్లను వాడుతున్నారు. హైబీమ్, ఎల్‌ఈడీ లైట్లు వాడితే ఆర్‌టీఏ చట్టం ప్రకారం రూ.500 నుంచి రూ.1500 వరకు జరిమానా విధించాలని సుప్రీంకోర్టు సూచించినా అధికారులు, పోలీసులకు పట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వాహనాలను బట్టి లైట్లు ఉండాలని, అడాప్టివ్ హెడ్‌లైట్లను వాహనం తయారు చేస్తున్న సమయంలో తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ఆ ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
వాహనాలకు సంబంధించి హెడ్‌లైట్ల విషయంలో దృష్టి సారించాం. వాహనం తయారు చేసే సమయంలో ఉన్న లైట్లనే వాడాలి. అధిక ఫోకస్ వచ్చేలా హైబీమ్, ఎల్‌ఈడీ లైట్లు వాడితే జరిమానా తప్పదు. ప్రతి వాహనం హెడ్‌లైట్‌కు పైభాగంలో నలుపు రంగు సగం వేసుకోవాలి. వాహనాలు తనిఖీ చేసేటప్పుడు హెడ్‌లైట్లు పరిశీలించాలని సిబ్బందికి సూచించాం. హెడ్‌లైట్లు మార్చిన వారికి ఫిట్‌నెస్ సమయంలో సరిచేయకుండా ధ్రువీకరణ ఇవ్వరాదని కూడా నిర్ణయించాం.
-గంగాధర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, శ్రీకాకుళం