Share News

ఆ కళ్లు సజీవం

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:38 AM

Eye Donation Fortnight begins today మానవుడి శరీరంలో అన్ని అవయవాల కన్నా.. కళ్లకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. ప్రకృతిని చూడాలన్నా.. ఆస్వాదించాలన్నా.. ఎదుటివారి భావాలు అర్థం చేసుకోవాలన్నా.. అన్నింటికీ నయనమే ప్రదానం. మంగళవారం నుంచి నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఆ కళ్లు సజీవం
కల్యాణ్‌ మగటపల్లినేత్ర సేకరణ కేంద్రం

  • నేత్రదానంతో మరొకరికి వెలుగులు

  • జిల్లాలో ఐ బ్యాంక్‌ లేక ఇబ్బందులు

  • నేటి నుంచి నేత్రదాన పక్షోత్సవాలు

  • శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి):

  • శ్రీకాకుళం నగరం పీఎన్‌ కాలనీకి చెందిన మండా రమణమ్మ 89 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఈ నెల 2న మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి స్థానికులు వివరిస్తే ముందు సంశయించారు. పెద్ద వయసున్న ఆమె కళ్లు దానం చేసినా.. ఎవరికైనా ఉపయోగపడతాయా? అని సందేహించి.. నేత్రదానం వద్దనుకున్నారు. కానీ.. కుటుంబ సభ్యులంతా మరోసారి చర్చించి.. ఆమె కళ్లు మరొకరికి ఉపయోగపడితే మంచిదే కదా అని భావించి.. నేత్రదానానికి అంగీకరించారు. రెడ్‌క్రాస్‌ టెక్నీషియన్‌ వచ్చి పరిశీలించి.. ఆమె కళ్లు ఫిట్‌గానే ఉన్నాయనే చెప్పడంతో ఎంతో సంతోషించారు. ‘ప్రస్తుతం మా నాన్నమ్మ చనిపోయినా.. ఆమె దానం చేసిన కళ్లు ఇంకొకరి ద్వారా ఈ సమాజాన్ని చూస్తున్నాయన్న ఊహ మాలో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంద’ని ఆమె మనమడు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వెంకటరమణ వెల్లడించారు.

  • శ్రీకాకుళం నగరానికి చెందిన మండా సీతాలక్ష్మి కొన్నాళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుమారుడైన ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు డీఎస్‌వీ భరద్వాజ్‌ అంగీకరించారు. ‘చూపు ప్రాధాన్యమేమిటో చిన్నప్పుడే దృష్టి కోల్పోయిన నాకు తెలుసు. మూడో తరగతిలో ఉన్నప్పుడు రెటినైటిస్‌ సిగ్మెంట్‌సాతో బాధపడ్డాను. చికిత్స కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆసువత్రులకు తిరిగినా.. ఆ వ్యాధికి మందే లేదని చెప్పారు. మెల్లమెల్లగా నా చూపు నాకు దూరమైంది. అన్ని అవయవాలు ఉన్నా చూపులేకపోతే జీవితంలో ఎంతకష్టమో ఆ బాధేమిటో అనుభవించాను. అందుకే మా అమ్మ చనిపోయినప్పుడు ఆమె కళ్లను దానం చేశాం. మాఅమ్మ కళ్లు మరొకరికి చూపు ప్రసాదించడంతో ఎంతో సంతోషంగా ఉంద’ని భరద్వాజ్‌ తెలిపారు.

  • మానవుడి శరీరంలో అన్ని అవయవాల కన్నా.. కళ్లకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. ప్రకృతిని చూడాలన్నా.. ఆస్వాదించాలన్నా.. ఎదుటివారి భావాలు అర్థం చేసుకోవాలన్నా.. అన్నింటికీ నయనమే ప్రదానం. మంగళవారం నుంచి నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేత్రదానం ప్రాముఖ్యత.. జిల్లాలో పరిస్థితులను తెలుసుకుందాం. జిల్లాలో అంధత్వ నివారణ సంస్థ నేత్రదానానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించినస్థాయిలో ఫలితం లేకపోతోంది. నేత్రదాన అంగీకారపత్రాలు ఇవ్వడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. కార్నియా అంధత్వం కారణంగా జిల్లాలో చాలామంది చూపు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువశాతం చిన్నారులే ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నేత్ర సేకరణ కోసం ఎటువంటి ఏర్పాట్లు లేవు. మృతుల నేత్రాల దానం చేయాలంటే వారి కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని రెడ్‌క్రాస్‌ను సంప్రదించాల్సిందే. పాతబస్టాండ్‌ సమీపాన కల్యాణ్‌ మగటపల్లి కేంద్రంలో రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో దాతల నుంచి నేత్రాలను సేకరిస్తున్నారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 2008 నేత్ర సేకరణ కేంద్రం ఏర్పాటైంది. ఇప్పటివరకు 598 మంది దాతల నుంచి 1195 కార్నియాలు సేకరించారు. ఈ నెలలోనే 48 కార్నియాలు సేకరించారు. జిల్లా నుంచి సేకరించినవాటిలో 841 కార్నియాలను అంధత్వం ఉన్నవారికి అమర్చారు. జిల్లా అంతటికీ ఒకే టెక్నీషియన్‌ అందుబాటులో ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మేరకు ప్రస్తుతం కార్నియాలనే సేకరిస్తున్నారు. ఈ కార్నియాలను జిల్లావైద్య ఆరోగ్యశాఖ ఆధ్యర్యంలోని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారానే విశాఖలోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ బ్యాంకుకు తరలిస్తుంటారు. కార్నియాలోని ఐదు లేయర్లలో బాధితులకు అవసరమైన వాటిని శస్త్రచికిత్స ద్వారా అమర్చుతారు. దీనిపై అవగాహన పెంచితే మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది.

  • అపోహలు..

  • నేత్రదానానికి అపోహలే అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ‘గిరిజన, పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. కళ్లను దానం చేస్తే.. కళ్లు లేకుండా పుడతారని నమ్ముతారు. ఇటువంటివి అపోహలే’నని టెక్నీషియన్‌ సుజాత తెలిపారు. హెచ్‌ఐవీ రోగులు, కుక్కకాటుకు గురైనవారు హెపటైటిస్‌, సిఫిలిస్‌ ఉన్నవారు తప్ప మిగిలిన వారంతా వయసుతో సంబంధం లేకుండా నేత్రదానం చేయొచ్చన్నారు. చనిపోయిన వ్యక్తి నుంచి ఆరు నుంచి ఎనిమిది గంటలలోపే కార్నియాను సేకరించాలని తెలిపారు.

  • అవగాహన కల్పిస్తున్నాం

  • నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకు నేత్రదాన పక్షోత్సవాలను వినియోగించుకుంటున్నాం. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసే ఆఫ్తాలమిక్‌ ఆఫీసర్లు, పీహెచ్‌సీ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం.

  • ఎస్‌.పుష్పలత, పొగ్రాం మేనేజర్‌, జిల్లా అందత్వ నివారణా సంస్ధ

  • మోటివేటర్ల ద్వారా కృషి చేస్తున్నాం

  • రెడ్‌క్రాస్‌ నేత్ర సేకరణ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి నేత్రదానంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. మృతుల నుంచి కార్నియాలు సేకరించడానికి కుటుంబ సభ్యులు అంగీకరించాల్సి ఉంటుంది. జిల్లాలో కార్నియా అంధత్వం ఉన్నవారి కంటే సేకరిస్తున్న కార్నియాలు తక్కువగానే ఉన్నాయి. ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల్లో అవగాహన ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

  • పి.జగన్మోహనరావు, చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ, శ్రీకాకుళం

  • నేత్రదానానికి ముందుకు రావాలి

  • నేత్రదానంతో మరొకరికి చూపురావడం ఎంతో గొప్ప విషయం. ఆఫ్తాలమిక్‌ అధికారిగా ప్రజల్లో కంటి ఆరోగ్యంతో పాటు నేత్రం దానంపై అవగాహన పెంపొందిస్తున్నా. మోటివేటర్‌గా నేత్రదాతల ద్వారా కార్నియా సేకరణకు తోడ్పాటునందిస్తున్నా.

  • ఎం.ఆర్‌.కె.దాస్‌, ఆప్తాలమిక్‌ ఆఫీసర్‌, మోటివేటర్‌

Updated Date - Aug 25 , 2026 | 12:38 AM