Share News

ఇది మిల్లర్ల దోపిడీ!

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:23 AM

Supply of ration rice to FCI జిల్లాలో కొంతమంది రైస్‌మిల్లర్ల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వందలాది టన్నుల రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ఫుడ్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌సీఐ)కు అప్పగించిన వైనం ఇటీవల బయటపడింది.

ఇది మిల్లర్ల దోపిడీ!
నరసన్నపేటలోని ఎఫ్‌సీఐ గోదాములో బియ్యం నిల్వలు

  • ఎఫ్‌సీఐకి రేషన్‌ బియ్యం సరఫరా

  • రూ.15 కోట్ల వరకు దోచేసిన వైనం

  • పెందుర్తి గోదాములో బట్టబయలు

  • మిల్లులకు నోటీసులు ఇచ్చిన అధికారులు

  • నరసన్నపేట, జూలై 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొంతమంది రైస్‌మిల్లర్ల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వందలాది టన్నుల రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ఫుడ్‌ కార్పొరేషన్‌(ఎఫ్‌సీఐ)కు అప్పగించిన వైనం ఇటీవల బయటపడింది. శ్రీకాకుళం, నరసన్నపేటకు చెందిన పలువురు మిల్లర్లు చేతివాటం ప్రదర్శించి.. పీడీఎస్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకు అంటకట్టి.. సుమారు రూ.15 కోట్లు దోచుకున్నట్లు ప్రచారం సాగుతోంది. సంబంధిత రైస్‌ మిల్లుల యాజమానులకు రికార్డులు సమర్పించాలని జేసీ నోటీసులు జారీచేయడం చర్చనీయాంశమవుతోంది.

  • పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు ఇస్తుంది. ఆ ధాన్యాన్ని మరపట్టి బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల సంస్థకు మిల్లర్లు సరఫరా చేయాలి. వాటిని సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)గా పిలుస్తారు. అయితే ఆ బియ్యం(సీఎంఆర్‌)లో చిరు వ్యాపారులు, దళారులు, డీలర్ల నుంచి సేకరించిన రేషన్‌ బియ్యాన్ని కలిపి మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. ఫుడ్‌ కార్పొరేషన్‌కు కల్తీ బియ్యాన్ని అంటగట్టి.. రూ.కోట్లు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్‌ బియ్యాన్ని.. లబ్ధిదారుల నుంచి వ్యాపారులు కిలో రూ.17 నుంచి రూ.20 వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యాపారుల నుంచి బియ్యాన్ని దళారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి.. నరసన్నపేట, మడపాం, శ్రీకాకుళం, కోటబొమ్మాళి, టెక్కలి, కాశీబుగ్గ తదితర మిల్లులకు తరలిస్తారు. వాటిని మిల్లర్లు రీసైక్లింగ్‌ చేసి.. కొత్త సంచులలో ప్యాకింగ్‌ చేసి ఎఫ్‌సీఐకు పంపిస్తారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జిల్లాలోని నైర, ఆమదాలవలస, సింగన్నపాలెం, నరసన్నపేట, నిమ్మాడ, తుంబయ్యపేట, రాయపాడు తదితర గిడ్డంగులకు మిల్లర్లు పంపించారు. ఇందులో కొందరు మిల్లర్లు నిజాయితీగా మర పట్టించిన బియ్యాన్ని పంపించారు. కానీ మరికొందరు మిల్లర్లు మాత్రం రేషన్‌ బియ్యం కల్తీ చేసి ఎఫ్‌సీఐకు పంపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు మిల్లర్లతో మిలాఖత్‌ అయ్యారనే విమర్శలు ఉన్నాయి.

  • పెందుర్తిలో బయటపడిన అక్రమాలు

  • జిల్లాలో గిడ్డంగుల సామర్థ్యం పూర్తికావడంతో కేంద్ర ప్రభుత్వం పెందుర్తి(విశాఖపట్నం)లోని పెందుర్తిలోని పౌరసరఫరాలశాఖ గోదాముకు బియ్యాన్ని పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా నుంచి మిల్లర్లు అక్కడకు బియ్యాన్ని పంపించారు. అక్కడ కు పంపించిన లారీలు జిల్లా నుంచి వెళ్లినట్లు జియోట్యాగ్‌ చూపించాల్సి ఉంది. కానీ జిల్లాలో పలువురు మిల్లర్లు పంపించిన బియ్యం లారీలు స్థానికంగా విశాఖ, విజయనగరం జిల్లా నుంచి వచ్చినట్లు సాంకేతిక ఆధారంగా గుర్తించారు. దీనిపై అనుమానం వచ్చిన అధికారులు బియ్యం బస్తాలను తీసుకోకుండా పెందుర్తిలోని గోదాము బయట ఉంచారు. బియ్యం నాణ్యత పరిశీలించగా రేషన్‌ బియ్యం కల్తీ అయినట్టు గుర్తించారు. జిల్లా నుంచి సుమారు రూ. 15కోట్ల విలువైన రేషన్‌ బియ్యం అంటగట్టినట్లు విశ్వనీయసమాచారం. కల్తీ బియ్యం సరఫరా ఉదంతంలో జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 42 రైస్‌మిల్లుల యాజమానులకు ఆయా జాయింట్‌ కలెక్టర్లు శుక్రవారం నోటీసులు జారీచేశారు. అన్ని రికార్డులు సమర్పించాలని, నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మిల్లర్లలో అలజడి రేగుతోంది.

  • నేరుగా ధాన్యం విక్రయాలు

  • ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరపట్టి మిల్లర్లు.. బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ కొందరు మిల్లర్లు.. ప్రభుత్వం కొనుగోలు చేసి అప్పగించిన ధాన్యాన్ని నేరుగా అమలాపురం, పెద్దపురం మిల్లర్లకు విక్రయించారు. రేషన్‌ బియ్యాన్ని తక్కువకు సేకరించి ప్రభుత్వానికి అప్పగించారు. ఇలా చేయడం ద్వారా ఒక ఏసిక్‌(లారీ) 29 టన్నుల బియ్యానికి గానూ మిల్లర్లకు రూ.5లక్షల వరకు మిగులుతుంది. నరసన్నపేట పట్టణానికి చెందిన రైస్‌మిల్లర్లు ఈ ఏడాది 75 ఏసీక్‌ (లారీలు) పీడీఎస్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకు పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా నుంచి 60వేల మెట్రిక్‌ టన్నుల వరకు పీడీఎస్‌ బియ్యాన్ని పంపి.. సుమారు రూ.15కోట్లు మిల్లర్లు దోచేసినట్టు సమాచారం. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.

Updated Date - Jul 05 , 2026 | 12:23 AM