ఇది సిక్కోలుకు స్వర్ణయుగం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:38 AM
సిక్కోలు జిల్లాకు ఇది స్వర్ణయుగమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
-త్వరలోనే మూలపేట పోర్టు, పలాస ఎయిర్‌పోర్టు..
-రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు
-ప్రభుత్వంపై నమ్మకంతోనే పెట్టుబడుల వెల్లువ
-కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
-శ్రీకాకుళంలో ‘రెండేళ్ల నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి’ సభ
శ్రీకాకుళం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): సిక్కోలు జిల్లాకు ఇది స్వర్ణయుగమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం - సంక్షేమం, అభివృద్ధి’ సభ విజయోత్సవ వేడుక కాదని, ప్రజలు తమపై ఉంచిన బాధ్యతను మరోసారి గుర్తు చేసుకునే వేదిక అన్నారు. శుక్రవారం శ్రీకాకులలలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబునాయుడు.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ప్రఽధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని, ఇలాంటి నాయకత్వాన్ని ప్రజలు వదులుకోకూడదని పిలుపునిచ్చారు.
- 2024-2029 కాలం శ్రీకాకుళం జిల్లాకు స్వర్ణయుగమని ఆయన అభివర్ణించారు. జిల్లాలో సమర్థులైన ప్రజాప్రతినిధులు ఉన్నారని, దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారని అన్నారు. మూలపేట పోర్టు పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని, మరికొద్ది నెలల్లోనే షిప్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పలాస విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అటు ఒడిశా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రైల్వేల విప్లవం జిల్లాలో కొనసాగుతోందని, తిరుపతికి నూతన రైలు సదుపాయంతో పాటు ఆరు కొత్త హాల్ట్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. రూ.3,300 కోట్లతో 54 ఆర్వోబీలు నిర్మిస్తూ రైల్వే అభివృద్ధిని రెట్టింపు చేశామని తెలిపారు. 60 ఏళ్లుగా జిల్లా ప్రజల కలగా మిగిలిపోయిన నేరడి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించామని, తద్వారా రెండు పంటలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఎచ్చెర్ల నుంచి ఇచ్ఛాపురం వరకు నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదులను క్రమబద్ధీకరించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
- ఎంపీగా పదేళ్లు అనేక సమస్యలపై పోరాటం చేశానని, కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో సమస్యలను పరిష్కరించానని తెలిపారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం నిలబడేలా రైల్వే జోన్ కోసం పోరాడి సాధించామన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాకుండా రూ.12,000 కోట్లు రప్పించి నిలబెట్టిన ఘనత కూటమి సర్కారుకే దక్కుతుందన్నారు.
- పన్నెండేళ్ల పాటు ప్రజారంజక పాలన అందించి ప్రజలు మెచ్చే నాయకుడిగా ఎదిగారంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం ‘వికసిత భారత్’ లక్ష్యాలను వేగంగా చేరుకుంటోందన్నారు. సభ అనంతరం కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలు, ప్రభుత్వ పథకాల పనితీరును వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు.
- కార్యక్రమంలో శ్రీకాకుళం, పాతపట్నం, నరసన్నపేట, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, జిల్లాకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.