ఇచ్ఛాపురంలో దాహం కేకలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:07 AM
water problems ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే దర్శనమిస్తున్నాయి. పేరుకే మునిసిపాలిటీ కానీ మేజర్ పంచాయతీ కన్నా తీసికట్టుగా మారుతోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
కానరాని అధికారుల ముందస్తు చర్యలు
15 ఏళ్ల క్రితం తాగునీటి పైపులైన్లు
పెరిగిన జనాభాకు తగ్గట్టుగా సరిపోని వైనం
మూలకు చేరిన తాగునీటి ప్రాజెక్టులు
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే దర్శనమిస్తున్నాయి. పేరుకే మునిసిపాలిటీ కానీ మేజర్ పంచాయతీ కన్నా తీసికట్టుగా మారుతోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పన్నులు వసూలు చేస్తున్నా.. కనీసస్థాయిలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా తాగునీటి ఇబ్బందులు వెంటాడుతున్నాయని వాపోతున్నారు.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో 15 ఏళ్ల కిందట తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో 28వేల మంది జనాభాకు తగ్గట్టుగా వీటిని వేశారు. ఇప్పుడు జనాభా 50వేలకు పెరిగింది. అందుకు తగ్గట్టు నీటి సరఫరా లేదు. పట్టణ జనాభాకు రోజుకు సగటున 5.10 మిలియన్ లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే సరఫరా చేస్తున్నారు. 1,2,3 వార్డులకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. చాలాచోట్ల ప్రజలు భూ మట్టానికి మూడు నుంచి ఐదు అడుగుల గొయ్యిలో ఉన్న కుళాయిల నుంచి నీటిని పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 బోర్లు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. కానీ అంతకుమించి మూలకు చేరాయని తెలుస్తోంది. రత్తకన్న పరిధిలో చాలా వీధులకు రెండు రోజులకోసారి నీరు ఇస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూలకు చేరిన ప్రాజెక్టులు
ఉద్దానం ప్రాజెక్టులో భాగంగా బాహుదా నదిలో ఊటబావులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేపట్టిన తరువాత రాజావారితోటలో రిజర్వాయర్ ద్వారా పట్టణ అవసరాల కోసం 8లక్షల లీటర్ల నీటిని ప్రతిరోజూ విడిచి పెడుతున్నారు. ఈ నీరు ప్రజల అవసరాలకు చాలడం లేదు. రూ.54.48 కోట్ల కేంద్ర నిధులతో పైలెట్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. అది పూర్తయితే కానీ.. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం లేదు.
1,2,3 వార్డుల పరిధిలోని పురుషోత్తపురం, ఏఎస్‌పేటకు ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకయ్యాయి. ట్రయల్‌రన్ వేసి వదిలేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అరకొరగా సరఫరా చేస్తున్నారు.
పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకర్‌ను నిర్మించి వృథాగా వదిలేశారు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంలో ఇచ్ఛాపురం మునిసిపాల్టీకి చోటిచ్చారు. కానీ.. ఇంతవరకూ నీటిని అందించలేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
ఏటా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. దశాబ్ద కాలం కిందట వేసిన పైపులైన్లు, కుళాయిలు పాడయ్యాయి. ఎప్పుడు నీటి సరఫరా ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలి.
- కాళ్ల మోహన్, ఇచ్ఛాపురం
మౌలిక వసతులు లేక..
జిల్లా కేంద్రం తరువాత ఏర్పడిన మునిసిపాలిటీ ఇది. కానీ ఆ స్థాయిలో మాత్రం మౌలిక వసతులు లేవు. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపించడంలో ప్రభుత్వాలు విఫలయమయ్యాయి. ఇప్పటికైనా పాలకులు దృష్టి సారించాలి.
- కె.యోగి, ఇచ్ఛాపురం
పరిష్కరిస్తాం
మునిసిపాలిటీలో తాగునీటి ఎద్దడి నిజమే. ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. త్వరలో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకంతోపాటు కేంద్ర నిధులతో చేపడుతున్న ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. అంతవరకూ ఇబ్బందులు తప్పవు.
- ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం మునిసిపాలిటీ