ఎక్కడోచోట.. క్షేమంగా ఉంటాడనుకుంటే!
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:27 AM
Youngman.. went missing in canal dies సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలో సోమవారం ఓ కారు అదుపుతప్పి.. వంశధార కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మెండ విశాల్‌కుమార్ (30) కూడా మృతి చెందాడు. ఖరగ్‌పూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఈయన బంధువుల పెళ్లి వేడుక నిమిత్తం ఇటీవల కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడులో తాతగారింటికి వచ్చాడు.
కాలువలో గల్లంతైన యువకుడి మృతి
20 గంటల తర్వాత మృతదేహం లభ్యం
కాలువలో గల్లతంయ్యాడు. ఎంత గాలించినా కనిపించలేదు. ప్రాణాలతో ఉంటాడని ఓమూలనో చిన్న ఆశ! ‘క్షేమంగా ఉంటే చాలు దేవుడా!’ అంటూ రాత్రంతా బంధువులు కన్నీళ్లతో మొక్కుకున్నారు. ఒక్కో గంట ఒక్కో యుగంలా గడిచిపోయింది. 20 గంటల నరకయాతన తర్వాత ఆ యువకుడు విగతజీవిగా కనిపించాడు. శుభకార్యం కోసం ఎక్కడో ఖరగ్‌పూర్ నుంచి వచ్చి.. నిర్జీవమై తిరిగి వెళ్లాడు.
‘‘ఏరా విశాల్.. నేనే నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పానురా. నాకు, చెల్లికి తోడుగా ఉంటావనుకున్నా. మాకు శాశ్వతంగా దూరమై పోయావు. కానీ ఇప్పుడు నిన్ను నిర్జీవంగా తీసుకెళ్తే అక్కడ మీనాన్నకు ఏం సమాధానం చెప్పాలిరా? రమ్మని చెప్పకుండా ఉంటే నిన్ను బతికించుకునేవాళ్లం’’
ఆ కన్నతల్లి గుండలవిసేలా ఏడుస్తూ అడిగిన ఈ ప్రశ్నకు అక్కడున్న ఏ ఒక్కరి వద్దా సమాధానం లేకపోయింది.
నరసన్నపేట, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలో సోమవారం ఓ కారు అదుపుతప్పి.. వంశధార కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మెండ విశాల్‌కుమార్ (30) కూడా మృతి చెందాడు. ఖరగ్‌పూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఈయన బంధువుల పెళ్లి వేడుక నిమిత్తం ఇటీవల కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడులో తాతగారింటికి వచ్చాడు. సోమవారం సారవకోట మండలం అలుదులో బంధువుల వివాహ వేడుకకు మేనమామతో కలిసి పీస రాము(46) వెళ్లాడు. అక్కడి నుంచి వారిద్దరూ కలిసి.. పార్వతీపురంలో చదువుతున్న రాము కుమార్తెను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా.. కిన్నెరవాడ సమీపంలో కారు అదుపు తప్పి వంశధార కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రాము అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. విశాల్‌కుమార్ గల్లంతు కావడంతో ఆచూకీ కోసం రాత్రి వరకు పోలీసులు, స్థానికులు గాలించారు. మంగళవారం ఉదయం 7.10 గంటల సమయంలో విశాల్‌కుమార్ మృతదేహం నరసన్నపేట మండలం జమ్ము గ్రామం వద్ద వంశధార కాలువలో లభ్యమైంది. కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనా స్థలాన్ని నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్ పరిశీలించారు. విశాల్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించి సారవకోట పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి సీహెచ్‌సీకి తరలించారు. పోస్టుమార్టం తర్వాత విశాల్‌కుమార్ మృతదేహాన్ని ఖరగ్‌పూర్‌లో తమ నివాసానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.
పెళ్లి సందడిలో విషాదం
విశాల్‌కుమార్.. తల్లిదండ్రులు ప్రభాకరరావు, భాగ్యలక్ష్మితో కలిసి ఖరగ్‌పూర్ జీవిస్తున్నారు. సోదరి చిన్ని ఇంజనీరింగ్ చదువుతోంది. విశాల్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అక్కడే పనిచేస్తున్నారు. ప్రభాకరరావు స్వగ్రామం సారవకోట మండలం అలుదు. కాగా.. పెళ్లి తర్వాత ఖరగ్‌పూర్ స్థిరపడ్డారు. బంధువుల వివాహం నిమిత్తం.. శనివారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మితో కలిసి విశాల్‌కుమార్ తాతగారింటికి కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సరదాగా గడిపారు. సోమవారం అలుదులో వివాహ వేడుకకు మేనమామతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ఊహించిన ఘోరం జరిగి.. కాలువలోకి కారు దూసుకెళ్లి మేనమామ, మేనల్లుడు మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసి.. ఖరగ్‌పూర్‌లో ఉంటున్న విశాల్‌కుమార్ తండ్రి కుప్పకూలిపోయారు. సోదరి చిన్ని మంగళవారం ఉదయం తాత గారింటికి చేరుకుంది. విగతజీవిగా ఉన్న అన్నను చూసి భోరున విలపించింది. బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
ఓ వైపు తమ్ముడు.. మరోవైపు కుమారుడు..
చీపుర్లపాడులో మంగళవారం పీస రాము అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు విశాల్‌కుమార్ మృతదేహం కూడా లభ్యం కావడంతో.. కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం నెలకొంది. ఓ వైపు తమ్ముడు రాము అంత్యక్రియల్లో పాల్గొంటునే.. మరోవైపు చేతికి అందివచ్చిన కొడుకు దూరమయ్యాడని.. విశాల్‌కుమార్ తల్లి భాగ్యలక్ష్మి విలపించిన తీరు కంటతడి పెట్టించింది.