Share News

దొంగలు బాబోయ్‌ దొంగలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:30 PM

జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలూ రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

దొంగలు బాబోయ్‌ దొంగలు

- తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్‌

- వరుసగా చోరీలు.. జనం బెంబేలు

- కేసులు, అరెస్టులు సరే.. నిఘా ఏదీ?

శ్రీకాకుళం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలూ రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పదిహేను రోజుల వ్యవధిలో శ్రీకాకుళం నగరం, పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో వరుసగా దొంగతనాలకు తెగబడ్డారు. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. రెక్కీ నిర్వహించి ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకుంటున్నారు. ఒంటరిగా ఉన్న వారికి మత్తుమందు ఇచ్చి దోపీడికి తెగబడుతున్నారు. వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను కూడా వదలడం లేదు. వాటిని ధ్వంసం చేసి అందులోని రాగిని అపహరిస్తున్నారు. పట్టుకోండంటూ పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. పోలీసులు ఘటన జరిగిన తర్వాత కేసులు కట్టడం.. అరెస్టులు చేయడం వరకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనాలను అరికట్టేందుకు, దొంగలపై నిఘా పెట్టడంలో వైఫల్యం చెందారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దొంగతనాలు ఇలా..

  • గత నెల 30న శ్రీకాకుళం మండలం నందగిరిపేటకు చెందిన పాతిన భూదేవమ్మ అనే వృద్ధురాలి మెడలో 32.4 గ్రాముల బంగారం పుస్తెలతాడును తెంచి దొంగలు పట్టుకుపోయారు. కారులో వచ్చిన దొంగలు నీరు కావాలని భూదేవమ్మను అడిగారు. భూదేవమ్మ నీరు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్తుండగా.. ఆమె మెడలో ఉన్న బంగారం పుస్తెలతాడును తెంచుకుని కారులో పరారయ్యారు.

  • ఈ నెల 9న ఉదయం శ్రీకాకుళం నగరంలోని పీఎన్‌ కాలనీ రెండో లైన్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత నేవీ అధికారి తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఊరు వెళ్లారు. తలుపునకు తాళం వేసి ఉండడాన్ని గుర్తించిన దొంగలు కిటికీ గ్రిల్స్‌ చాకచక్యంగా తొలగించి ఇంటిలోకి ప్రవేశించారు. సుమారు 5 తులాల బంగారం, అర కిలో వెండితో పాటు పలు ఎలకా్ట్రనిక్‌ వస్తువులను ఎత్తుకెళ్లారు.

  • శ్రీకాకుళం నగర పరిధిలోని నాయుడిపేటలో నివాసం ఉంటున్న సచివాలయ కార్యదర్శి దంపతులు ఈనెల 14న రాజమహేంద్రవరం వెళ్లి 15న తిరిగి వచ్చారు. వారి బెడ్‌రూమ్‌లోని మంచం లాకర్‌ తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఐదు తులాల బంగారు చేతి గొలుసు, నల్లపూసలు, చెవి పోగులు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • కాశీబుగ్గ శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఓ మహిళ చెప్పుల దుకాణంలో పనిచేస్తుంది. ఈ నెల 7న ఆమె విధులకు వెళ్లిన సమయంలో పట్టపగలే దొంగలు ఇంటి తాళాలను పగులగొట్టి లోపలకు వెళ్లి రూ.7 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

  • ఈ నెల 8న పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిని దొంగలు టార్గెట్‌ చేశారు. ముందుగా ఆమెతో మాటలు కలిపి పరిచయం పెంచుకున్నారు. ఆ చనువుతో ఆమెకు ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపారు. ఆమె స్పృహ కోల్పోగానే 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు దోచుకెళ్లారు.

  • ఈ నెల 18న శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్‌ బేగ్‌ పేట, కిమ్స్‌ ఆసుపత్రి రోడ్డులో ఉన్న వైన్స్‌ దుకాణంలో చోరీ జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి, అందులో ఒకరు రాడ్డుతో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. కౌంటర్‌లో ఉన్న రూ. 2.60 లక్షల నగదు, ఖరీదైన మద్యం సీసాలు, ఒక సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లారు. దుకాణం యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుల అరెస్టు..

వరుస చోరీలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం దర్యాప్తును వేగవంతం చేసి పలు కేసుల్లో నిందితులను అరెస్టు చేసింది.

  • శ్రీకాకుళం మండలం నందగిరిపేటలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఈ నెల 5న ఆమదాలవలస మండలం మెట్టక్కివలసకి చెందిన మెండ వెంకటరమణ, గుంట ప్రమీల, గుంట జగదీశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. చోరీకి గురైన రూ.5లక్షల విలువైన 32.4 గ్రాముల బంగారం పుస్తెలతాడును రికవరీ చేశారు.

  • పలాస-కాశీబుగ్గలో వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి దోపీడీకి పాల్పడిన కేసులో పలాస మండలం శాసనం గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి సొత్తును రికవరీ చేశారు.

  • కాశీబుగ్గ శ్రీనగర్‌ కాలనీలో ఇంటి తాళాలు పగులగొట్టిన కేసులో మేదరవీధి, ఉదయపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

  • నగరంలో జరిగిన వైన్స్‌ షాపు చోరీ, సచివాలయ ఉద్యోగి ఇంటిలో దొంగతనం తదితర కేసులపై రెండో పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

వరుస చోరీల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ‘కుటుంబ సమేతంగా ఊరు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వీలైతే ‘పోలీస్‌ లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టమ్‌’ సేవలను వినియోగించుకోవాలి. ఇంట్లో ఎక్కువ నగదు, విలువైన ఆభరణాలు ఉంచకూడదు. వృద్ధులు, ఒంటరి మహిళలు అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవద్దు. ప్రతి కాలనీ, వ్యాపార సముదాయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి’.అని సూచిస్తున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:30 PM