Share News

పొలాల్లో దొంగలు!

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:35 AM

Copper wire theft from transformers జిల్లాలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో బోర్లు ద్వారా కొంత ఉపశమనం పొందాలని భావిస్తున్నారు. కానీ ఇటీవల జిల్లాలో పలుచోట్ల వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైరు చోరీకి గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్లు పాడై విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు ద్వారా కూడా సాగునీరు అందించలేని దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొలాల్లో దొంగలు!
ఉప్పినివలసలో ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్‌ చోరీ చేసిన దృశ్యం (ఫైల్‌)

  • ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైరు చోరీ

  • జిల్లాలో వరుసగా ఘటనలు

  • ఆందోళనలో రైతులు

  • రణస్థలం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి):

  • ఈ నెల 2న శ్రీకాకుళం మండలం వాకలవలస- లింగాలవలస పరిధిలోని పొలాల్లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగివైరు చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రాగివైరును పట్టుకుపోయారు.

  • ఈ నెల 5న ఎల్‌.ఎన్‌.పేట మండలం గార్లపాడు పామాయిల్‌ తోటల్లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగివైరు చోరీకి గురైంది.

  • రణస్థలం మండలం రావాడ పంచాయతీ ఉప్పినివలస, గోశాంలో సైతం కొన్నాళ్ల కిందట ఇదే మాదిరిగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అందులో విలువైన రాగిని తీసుకొని దొంగలు వాటిని పడేశారు. ఆ సమయంలో రైతులు పడే బాధ వర్ణనాతీతం.

  • జిల్లాలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో బోర్లు ద్వారా కొంత ఉపశమనం పొందాలని భావిస్తున్నారు. కానీ ఇటీవల జిల్లాలో పలుచోట్ల వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైరు చోరీకి గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్లు పాడై విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు ద్వారా కూడా సాగునీరు అందించలేని దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న పొలాల్లో ఉన్న పాత ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు టార్గెట్‌ చేస్తున్నారు. సుమారు పదేళ్ల కిందట అమర్చిన ట్రాన్స్‌ఫార్మర్‌లో 10 నుంచి 14 కిలోల వరకు రాగివైరు(కాపర్‌) వస్తుంది. మార్కెట్‌లో కిలో రాగి ధర రూ.2,500 పలుకుతోంది. దీంతో ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగివైరు చోరీ చేసి విక్రయిస్తూ రూ.25వేల నుంచి రూ.30వేల వరకూ సంపాదిస్తున్నారు. రాగివైరును బరంపూర్‌, కటక్‌, జైపూర్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. విద్యుత్‌ సమస్యల కారణంగా రైతులు సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో సైతం రాగి, అల్యూమినియం ఉండడంతో దుండగులు వాటిని కూడా టార్గెట్‌ చేస్తున్నారు.

  • లక్షల ధనం వృథా

  • సాధారణంగా 25కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ విలువ రూ.4 లక్షలు ఉంటుంది. దానిలో రాగి విలువ రూ.70 వేల వరకూ ఉంటుంది. రాగిచోరీ సమస్యను అధిగమించేందుకు విద్యుత్‌శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి బదులు అల్యూమినియం అమర్చుతున్నారు. రాగి ధరతో పోలిస్తే అల్యూమినియం ధర తక్కువ. కాగా దొంగతనాలకు అలవాటుపడిన వారు పాత ట్రాన్స్‌ఫార్మర్లలో రాగిని చోరీ చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేయడంలో రూ.లక్షల ధనం వృథా అవుతోంది. అలాగే దుండగులు చోరీలో భాగంగా విద్యుత్‌ వైర్లను కట్‌చేసి విడిచిపెడుతుండడంతో రైతులు పొరపాటున ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారుల చెంతనే పొలాల్లో ఉన్న విద్యుత్‌ మోటార్లు సైతం చోరీకి గురవుతున్నాయి. దీనిపై పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

  • అప్రమత్తంగా ఉండాలి..

  • రైతులు అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై దృష్టి పెట్టాలి. పొలాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దొంగలను పట్టుకుంటాం.

    -ఎం.అవతారం, జేఆర్‌ పురం సీఐ

Updated Date - Aug 09 , 2026 | 12:35 AM