రూ.లక్షలంటారు.. దోచేస్తారు!
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:08 AM
Lottery ticket sales రాష్ట్రంలో లాటరీ వ్యవహారంపై నిషేధం ఉన్నా, జిల్లాలో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతోంది. అమాయక ప్రజలకు రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ ఆశచూపి, వారి జేబులకు చిల్లులు పొడుస్తున్న ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే సాగుతున్నా పోలీసులు చర్యలు లేవు.
ఆశచూపి.. సామాన్యులకు నిలువు దోపిడీ
ఏపీలో నిషేధమైనా.. జిల్లాలో లాటరీ టిక్కెట్ల విక్రయాలు
శ్రీకాకుళం, పలాస, నరసన్నపేటల్లో రోజుకు రూ.10 లక్షల దందా
రోజుకూలీలు, చిరు వ్యాపారులే టార్గెట్..
కాకినాడ, గోదావరి జిల్లాల నుంచి నెట్‌వర్క్ ఆపరేషన్
కొంతమంది పోలీసుల సహకారంపై విమర్శలు
ఒక్క టికెట్‌తో మీరు లక్షాధికారి అయిపోవచ్చని చెబుతారు. ఫలానా వ్యక్తికి తగిలిందని ఆశ పెడతారు. ఎలాగోలా కొనిపిస్తారు. తర్వాత మూమూలే. లక్షలాది మందిలో ఓ ఒక్కరికో అదృష్టం వరించిందంటారు. అప్పటి వరకు కళ్లలో వత్తులు వేసుకుని చూసిన సామాన్యులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో నిత్యం జరుగుతున్న తంతు ఇది. రాష్ట్రంలో లాటరీపై నిషేధం ఉన్నా.. జిల్లాలో మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా మిన్నకుండి పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
శ్రీకాకుళం/ క్రైం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాటరీ వ్యవహారంపై నిషేధం ఉన్నా, జిల్లాలో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా జోరుగా సాగుతోంది. అమాయక ప్రజలకు రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ ఆశచూపి, వారి జేబులకు చిల్లులు పొడుస్తున్న ఈ అక్రమ వ్యాపారం బహిరంగంగానే సాగుతున్నా పోలీసులు చర్యలు లేవు. నగరంలోని నెహ్రూ రోడ్, డేఅండ్‌నైట్ జంక్షన్‌లోని ఇన్‌కమ్‌టాక్స్ కార్యాలయ భవనం సమీపంలో ఉన్న ఓ పాన్ షాపు, కృష్ణాపార్క్ జంక్షన్, కిన్నెర కాంప్లెక్స్ సమీపంలోని పాన్‌షాపులే అడ్డాగా లాటరీ టిక్కెట్ల విక్రయాలు సాగుతున్నాయి. నరసన్నపేట, పలాస ప్రాంతాల్లోనూ ఈ వ్యవహారం గుట్టుగా నడుస్తోంది. జిల్లా కేంద్రంలోనే ఈ వ్యాపారం రోజుకు రూ.5 లక్షలకుపైగా సాగుతుండగా, పలాస, నరసన్నపేట ప్రాంతాల్లో మరో రూ.5 లక్షల మేర టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.
పేర్లు అనేకం.. మోసం ఏకం..
లాటరీ పేరుతో రకరకాల బ్రాండ్లను తెరపైకి తెచ్చారు. బోడో ల్యాండ్, ఫ్యూచర్, సింగం, కుయిలీ, రోశ, కుమరన్, విష్ణు, స్వర్ణ లక్ష్మి, నల్లనేరమ్, లయన్, డీర్, తంగం, డేటా తదితర పేర్లతో యథేచ్ఛగా లాటరీ టిక్కెట్లను విక్రయిస్తున్నారు. స్థానికంగా కూడా ‘కామాక్షి’, ‘ఏఆర్ లక్ష్మి’, ‘డైమండ్ వైష్ణవి’ పేర్లతో ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 8 గంటలకు ప్రైజ్‌మనీ అంటూ ఫలితాలు ప్రకటిస్తున్నారు.
అప్పుల ఊబిలో సామాన్యులు..
చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, ఆటోడ్రైవర్లను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో టికెట్ ధర రూ.80 నుంచి రూ. 500 వరకు విక్రయిస్తున్నారు. ‘ఒక్క టిక్కెట్‌తో లక్షాధికారి అయిపోవచ్చు.. ఫలానా వ్యక్తికి లాటరీ తగిలింది’ అంటూ చేసే ప్రచారాన్ని నమ్మి జనం మోసపోతున్నారు. యువత, దినసరి కూలీలు రోజుకు రూ.500 నుంచి రూ. 800 వరకు వెచ్చించి గంపగుత్తుగా టిక్కెట్లు కొంటూ వ్యసనంగా మార్చుకున్నారు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్నా.. అప్పు చేసి మరీ లాటరీ టిక్కెట్లకు అర్పిస్తున్నారు. లాటరీ ఫలితాల కోసం దుకాణాల వద్దే పడిగాపులు కాసి, చివరికి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
అసలు సూత్రధారులు ఎవరు?
వాస్తవానికి ఈ లాటరీలో ప్రైజ్‌మనీ ఎవరికో ఒకరికి వరిస్తుందే తప్ప.. అందులో ఎలాంటి స్పష్టతా ఉండదు. అసలు లాటరీ విజేత పేరు, ఊరు లాంటి వివరాలు ఏవీ బయటకు తెలియవు. కొనుగోలుదారులు తీసుకుంటున్న టిక్కెట్లు అసలైనవా? లేక జిరాక్స్ కాపీలతో గుట్టుగా ముద్రిస్తున్నారా? అన్నది ఎవరికీ తెలియదు. చిన్నపాటి స్లిప్పులనే లాటరీలుగా అంటగడుతున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, కాకినాడకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వారిద్దరి నుంచి శ్రీకాకుళం నగరంలోని ఇద్దరు వ్యక్తులు భారీగా టిక్కెట్లు కొనుగోలు చేసి, తమ ఏజెంట్ల ద్వారా వీధి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇలాంటి వాటిపై పోలీసులు కనీస నిఘా పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు లాటరీ విక్రయదారులు పోలీసులకు పట్టుబడినా.. ‘పెట్టీ కేసే కదా.. కొంత ఫైన్ కట్టి వచ్చేయవచ్చు’ అన్న ధీమాతో నిర్భయంగా లాటరీ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ దందాకు కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కఠినచర్యలు తప్పవు :
జిల్లాలో లాటరీల విక్రయాలపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అంతటా నిఘా పెంచుతాం. లాటరీ టిక్కెట్లు విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.
- ఎస్పీ మహేశ్వరరెడ్డి