Share News

నిలిపేస్తారు.. ప్రాణాలు తోడేస్తారు

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:20 AM

Parking of vehicles on the highway జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ప్రధానంగా పలాస, సొండోడు కొట్టు, కంచిలి, బేసి, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, రణస్థలం వద్ద దాబాలు, మెకానిక్‌ షెడ్లు, పంక్చర్‌ దుకాణాల వద్ద ఇషారాజ్యంగా భారీ వాహనాలు నిలిపేస్తున్నారు.

నిలిపేస్తారు.. ప్రాణాలు తోడేస్తారు
కొబ్బరిచెట్లూరు, పలాస బైపాస్‌లో వద్ద హైవేపైనే బారులు తీరిన వాహనాలు.

  • జిల్లాలో జాతీయరహదారిపై ఇష్టారీతిన వాహనాల పార్కింగ్‌

  • తరచూ ప్రమాదాలు

  • హరిపురం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి):

  • పలాస బైపాస్‌ రోడ్డులో గత నెల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైపాస్‌ సమీపంలో ఆగిఉన్న లారీ స్టార్ట్‌ చేసి పక్కకు తిప్పే సమయంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

  • గత ఏడాది మందస - పలాస మండలాల సరిహద్దులోని కొబ్బరిచెట్లూరు సమీపంలో ఆగిఉన్న లారీని కారు ఢీకొనటంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. అలాగే ఇదే ప్రాంతంలో గతంలో రోడ్డుపై నిలిచిన వాహనాన్ని తప్పించబోయి పోలీసు వాహనం డివైడర్‌ను ఢీకొని.. అవతల రోడ్డులో వస్తున్న లారీని కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ఏఆర్‌ కానిస్టేబుళ్లు మృతి చెందారు.

  • జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ప్రధానంగా పలాస, సొండోడు కొట్టు, కంచిలి, బేసి, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, రణస్థలం వద్ద దాబాలు, మెకానిక్‌ షెడ్లు, పంక్చర్‌ దుకాణాల వద్ద ఇషారాజ్యంగా భారీ వాహనాలు నిలిపేస్తున్నారు. బ్లాక్‌ స్పాట్‌ల కంటే ఈ వాహనాలే దడ పుట్టిస్తున్నాయి.

  • మందస - పలాస మండలాల సరిహద్దులో సొండోడు కొట్టు(కొబ్బరిచెట్లూరు) వద్ద ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు రోడ్డు పైనే వాహనాల బారులుదీరుతున్నాయి. గ్రామానికి వెళ్లేకూడలి వద్ద రహదారి సైతం వాహనాలతో రద్దీగా తయారై ప్రమాదాలకు కారకంగా మరుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

  • పలాస బైపాస్‌లో దాబాల వద్ద రోడ్డుపైనే భారీ వాహనాలు రోజంతా నిలిపివేస్తుండటంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలోనే పంక్చర్‌ దుకాణాలు, టీ షాపులు, దాబాలు, బోజన హోటళ్లు ఉండటంతో రోజంతా ఇక్కడ వాహనాలు నిలిచే ఉంటాయి. దీంతో వాహనదారులు ఈ ప్రాంతంలో ప్రయాణించాలంటే సాహసం చేయాల్సిందే.

  • బేసిరాంచంద్రాపురం, కంచిలి కూడళ్లు వద్ద రోడ్డుపైనే వాహనాలు నిలిపేస్తున్నారు. కొర్లాం కూడలిలో సైతం మధ్యాహ్నం 12గంటల నుంచి వాహనాల రద్దీ అధికమై ప్రమాదకరంగా మారుతోంది.

  • టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల్లో వంతెనలు ఎక్కే వద్ద ఆటోలు, లారీలు, ద్విచక్రవాహనాలు నిలిపేస్తుండటంతో హైవేపై ప్రమాదాలు జరుగుతున్నాయి. పార్కింగ్‌కు స్థలం ఉన్నా.. రోడ్లుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు.

  • శ్రీపురం, జాడుపూడి, టెక్కలి సమీపంలో జాతీయ రహదారి పక్కనే సంతలు జరుగుతుంటాయి. ఇక్కడకు వచ్చే క్రయవిక్రయదారులు హైవేపైనే వాహనాలను నిలిపేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.

  • కొర్రాయిగేటు, నరసన్నపేట, ఎచ్చెర్ల వంటి పలు ప్రాంతాల్లో వెహికల్‌ బే ఉన్నా నిరుపయోగమే. వంతెనలు ఎక్కేచోట దిగేచోట షెడ్లు వేసి ఉన్నాయి. వాహనాలు నిత్యం నిలిపేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెన దిగిన వెంటనే ప్రధాన కూడళ్ల వద్ద ఇదే పరిస్థితి. పోలీసు గస్తీ పెంచాల్సి ఉంది.

  • కఠినచర్యలు తప్పవు

  • రోడ్డుపై వాహనాలు నిలిపితే కఠినచర్యలు తప్పవు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డుపక్కన దాబాలు, భోజన శాలల వద్ద నిఘా పెంచుతాం. 50 కిలోమీటర్లకు చొప్పున ఒక పెట్రోల్‌ వెహికల్‌లో పోలీసులు నిరంతరం తిరుగుతున్నారు. జాతీయ రహదారిపై భద్రత మరింత కట్టుదిట్టం చేస్తాం.

    - టి.భవాని, డీఎస్పీ, కాశీబుగ్గ

Updated Date - Jun 22 , 2026 | 12:20 AM