Share News

ఓటర్లుగా గుర్తించలేదు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:07 AM

300 votes lost in Mogilipadu పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ మొగిలిపాడు గ్రామంలో 300 మంది ఓట్లు గల్లంతుకావడం చర్చనీయాంశమవుతోంది. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా గల్లంతు కాకుండా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌) ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కొన్నాళ్ల కిందట అధికారులకు నిర్దేశించారు.

ఓటర్లుగా గుర్తించలేదు
మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఓటర్ల నమోదుకు వచ్చిన మొగిలిపాడు గ్రామస్థులు

మొగిలిపాడులో 300 ఓట్లు గల్లంతు

యుద్ధప్రాతిపదికన నమోదుకు చర్యలు

పలాస, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ మొగిలిపాడు గ్రామంలో 300 మంది ఓట్లు గల్లంతుకావడం చర్చనీయాంశమవుతోంది. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా గల్లంతు కాకుండా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌) ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కొన్నాళ్ల కిందట అధికారులకు నిర్దేశించారు. కాగా.. మొగిలిపాడులో మాత్రం ఓట్ల నమోదు ప్రక్రియ సక్రమంగా సాగలేదు. ఈ గ్రామంలో 2వేల ఓట్లు ఉండగా.. కిందిస్థాయి ఉద్యోగులు చేసిన పొరపాటు కారణంగా జాబితాలో 300 ఓట్లు గల్లంతుకావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ తప్పిదాన్ని గుర్తించిన అధికారులు కొత్తగా ఇచ్చిన వెసులుబాటుతో ఓటర్ల నమోదును యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. మొగిలిపాడులో జీడి కార్మికులు, ఇతర మట్టిపనులకు వెళ్లే కార్మికులే 90 శాతం మంది ఉన్నారు. ‘సర్‌’ కార్యక్రమం నిర్వహించినప్పుడు గ్రామంలో ప్రజలు ఎక్కువగా అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్న ఓటర్ల పేర్లను వీఆర్వో, సచివాలయ సిబ్బంది నమోదు చేసి.. మిగిలిన వారి వివరాలు సేకరించలేకపోయారు. దీంతో సుమారు 300 మంది ఓట్లు గల్లంతు కావడంతో ఆయా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఐదారు సార్లు ఓటుహక్కు వినియోగించుకున్నా.. తమను ఓటర్లుగా ఎందుకు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు మునిసిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటరు పెట్టి ఆయా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొగిలిపాడు సచివాలయంతోపాటు స్థానికంగా ఉన్న సిబ్బంది, రెవెన్యూ అధికారులను కార్యాలయానికి రప్పించి ప్రజల నుంచి నేరుగా వివరాలు తీసుకొని ఓటర్లగా చేర్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై మునిసిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా.. ‘‘సర్‌’ కార్యక్రమంలో ఓట్లు గల్లంతయిన విషయం మా దృష్టికి వచ్చింది. ఎక్కువగా జీడి కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారణంగా ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందనా లేకపోయింది. ఎన్యూమరేటర్లు అటువంటి వారిని గుర్తించలేపోయారు. గల్లంతైన ఓట్లను తిరిగి నమోదు చేయిస్తున్నామ’ని తెలిపారు.

Updated Date - Aug 18 , 2026 | 12:07 AM