జీఎస్టీ అధికారులమని.. దోచేశారు
ABN , Publish Date - May 03 , 2026 | 12:13 AM
Robbery in a gold shop.. Interstate gang involved జీఎస్టీ అధికారులమంటూ వ్యాపారిని నమ్మించి.. కాశీబుగ్గలోని బంగారం దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులేనని గుర్తించి.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
కాశీబుగ్గలోని బంగారంషాపులో ఘటన అంతర్రాష్ట్ర ముఠా పనే
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
దోపిడీ సొత్తు, రెండు తుపాకీలు, వాహనాలు స్వాధీనం
సాంకేతిక ఆధారాలతో చేధించిన పోలీసులు
శ్రీకాకుళం క్రైం, మే 2(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ అధికారులమంటూ వ్యాపారిని నమ్మించి.. కాశీబుగ్గలోని బంగారం దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులేనని గుర్తించి.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు తుపాకీలు, బంగారం ఆభరణాలు, నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం శ్రీకాకుళలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు.
ఏమి జరిగిందంటే..
కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వర జ్యూయలరీ షాపులో గత నెల 7న భారీ దోపిడీ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏడుగురు వ్యక్తులు నెంబర్ ప్లేట్లు లేని మూడు బైక్‌లపై వచ్చారు. బంగారం దుకాణంలో ప్రవేశించారు. ఆ సమయంలో షాపు యజమాని కిల్లంశెట్టి రామకృష్ణారావు ఒక్కరే ఉండగా తమను జీఎస్టీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఆపై షాపు తనిఖీ చేయాలని చెప్పి.. రామకృష్ణారావును చుట్టుముట్టి ఆయన చేతులకు బేడీలు వేశారు. తర్వాత తుపాకీతో బెదిరించి 800 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనిగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా రంగంలోకి దిగారు. సీసీ పుటేజీల్లో లభ్యమైన బైక్ ఫొటోల ఆధారంగా ఫైనాన్స్ సంస్థల వద్ద వివరాలు సేకరించారు. అంతర్రాష్ట్ర ముఠా, పాత నేరస్థుల పనేనని నిర్ధారణకు వచ్చారు. వారి కోసం గాలించి మాటువేశారు. ఇందులో భాగంగా ఒడిశా సరిహద్దులోని లొట్టూరు వద్ద ఒడిశాకు చెందిన రామచంద్రసాహు అలియాస్ బాబు, కునా బరిక్, బనోజ్ బిహారి పట్నాయక్, తపన్ మహారాణా, కాశీబుగ్గకు చెందిన పొట్నూరు తిరుమల పాత్రో అలియాస్ హరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 243 గ్రాముల బంగారంతో పాటు రెండు తుపాకీలు, రూ.3,41,000 నగదు, దోపిడీ చేసిన సొత్తుతో కొనుగోలు చేసిన రెండు కార్లు, నేరం చేయడానికి ముందుగా కొనుగోలు చేసిన రెండు కార్లు, 12 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.49 లక్షలు ఉంటుంది. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై ఒడిశాలో 32 కేసులు ఉన్నాయి. ఈ ముఠాలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. కేసును చేధించడంలో కీలకపాత్ర పోషించిన ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐలు వై.రామకృష్ణ, ఎం.చిన్నన్నాయుడు, ఆర్.నరసింహమూర్తి, ఎస్‌ఐలు సునీల్, కె.మధుసూదనరావు, రాజేష్, పి.పారినాయుడు, సి.హెచ్.గంగరాజు, హెచ్‌సి గవరయ్య, కానిస్టేబుళ్లు ఉషాకిరణ్, ఎం.నీలకంఠం, మాదవ్, ఆలీ, షన్ముఖరావు, భాసీర్, లోకనాధం, రాధాకృష్ణ, హరీష్ తదితరులను ఎస్పీ అభినందించారు.
టోల్‌ప్లాజాలను తప్పిస్తూ...
పక్కా వ్యూహంతోనే ఈ దొంగతనానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఏ5 నిందితుడిగా ఉన్న తిరుమలపాత్రో అలియాస్ హరి.. దొంగ బంగారాన్ని కొనుగోలు చేసి దుకాణదారులకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌నుంచి వెంకటేశ్వర జ్యూయలరీపై రెక్కీ నిర్వహిస్తూ వచ్చాడు. రామచంద్ర సాము అలియాస్ బాబు, కునా బరిక్ సైతం మార్చిలో రెక్కీ కోసం వచ్చారు. ఈ క్రమంలోనే తిరుమలపాత్రో వారికి రూట్‌మ్యాప్ ఇచ్చాడు. ఒడిశా నుంచి కాశీబుగ్గ చేరుకొనే క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద దొరికిపోకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల మీదుగా వారు కాశీబుగ్గ చేరుకొనేలా ప్రణాళిక రూపొందించారు. నిందితులు భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఖుర్దా, ఆస్కా, దిగవుండి, మహేంద్రగిరి, లావణ్యకోట, గండహాతి, గరబంద, గొప్పిలి, పెదంచల మీదుగా కేదారిపురం చేరుకున్నారు. ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను సిద్ధం చేసుకున్నారు. కేదారిపురం సమీపంలో ఖాళీ లేఅవుట్‌లో కారు ఉంచి నెంబర్ ప్లేటు లేని బైక్‌లపై వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. బైక్‌లపై తిరిగి వచ్చి అదే మార్గంలో వెళ్లిపోయారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
బంగారం దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. ‘సీసీ కెమెరాల్లో డేటాను నిర్దిష్ట కాలానికి భద్రపరచుకోవాలి. వీడియో రికార్డ్స్ కూడా భద్రపరిస్తే.. ఒకవేళ దోపిడీలు, నేరాలు జరిగినప్పుడు విచారణ సమయంలో కీలక ఆధారాలు లభిస్తాయి. బంగారం దుకాణాల్లో క్రయవిక్రయాల సమయంలో అనుమానాస్పద పరిస్థితులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల’ని ఎస్పీ తెలిపారు.