కడుపునొప్పి అని వెళ్తే ప్రాణం పోయింది
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:40 PM
కడుపు నొప్పి అని ఆ మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు పేగు కుళ్లిందని చెప్పి ఆపరేషన్ చేశారు.
-చికిత్స పొందుతూ మహిళ మృతి
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ
- ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన
- కేసు సీరియస్ అని ముందే చెప్పామంటున్న డాక్టర్లు
నరసన్నపేట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కడుపు నొప్పి అని ఆ మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు పేగు కుళ్లిందని చెప్పి ఆపరేషన్ చేశారు. పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ మహి ళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, కేసు సీరి యస్ అని వారికి ముందే చెప్పామని వైద్యులు అంటున్నారు. మృతురాలి కు టుంబ సభ్యులు, బంధువుల వివరాల మేరకు.. నరసన్నపేట పట్టణంలోని సంతపేటకు చెందిన వసననాబి భాగ్యలక్ష్మి (49) అనే మహిళకు గత నెల 25న కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను పట్టణంలోని ఒక ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి కడుపులోని చిన్న పేగు చాలా భాగం కుళ్లిపోయిందని, వెంటనే శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. ఆ మేరకు భాగ్యలక్ష్మికి ఆపరేషన్ చేశారు. అనంతరం పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం మృతిచెందింది. అయితే, మృతిచెందిన తరువాత భాగ్యలక్ష్మిని వేరొక ఆసుపత్రికి తరలించేందుకు వైద్యులు ప్రయత్నించారని, వారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ గణేష్, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వైద్యులు, మృతురాలి బంధువులతో ఎస్‌ఐ మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. వైద్యులు నిర్లక్ష్యమే భాగ్యలక్ష్మి ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమని ఆమె తోటికోడలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆసుపత్రి డాక్టర్ మాట్లాడుతూ ‘భాగ్యలక్ష్మి కడుపులో చిన్నపేగులు కుళ్లిపోవడంతో పాటు చాలా భాగం దెబ్బతింది. ఆమెను చాలామంది డాక్టర్లకు చూపించి నా వద్దకు వచ్చారు. పరిశీలించి పరిస్థితి చాలా కాంప్లికేటెడ్‌గా ఉందని ముందుగానే కుటుంబ సభ్యులకు చెప్పాం. వారి అంగీకారంతోనే శస్త్రచికిత్స చేశాం. వారం రోజుల పాటు బాగానే ఉన్నా.. ఒక్కసారి పరిస్థితి మారడంతో మృతి చెందింది’ అని తెలిపారు.