పథకం ప్రకారమే చంపేశారు
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:28 PM
లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి(24)ని పథకం ప్రకారమే తల్లి పైల విజయకుమారి, తాత దుంపల బలుసాకు, భర్త దంతేశ్వరరావు హత్య చేశారని డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు.
- కన్న కూతుర్ని కడతేర్చిన తల్లి, భర్త, తాత
-మాట్లాడుదామని పిలిచి ఘాతుకం
- గుండెపోటుతో చనిపోయిందని నాటకం
- ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
టెక్కలి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి(24)ని పథకం ప్రకారమే తల్లి పైల విజయకుమారి, తాత దుంపల బలుసాకు, భర్త దంతేశ్వరరావు హత్య చేశారని డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. బుధవారం స్థానిక సబ్‌డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ హత్య కేసు వివరాలను ఆయన వెల్లడించారు. హరిణికి ఆరేళ్ల కిందట తన మేనమామ దంతేశ్వరరావుతో వివాహమైంది. రెండేళ్ల కిందట హరిణి గ్రూప్స్ కోచింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌కు వెళ్లింది. అక్కడ కోచింగ్ సెంటర్‌లో అదే ప్రాంతానికి చెందిన సుధానాగేంద్రతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో హరిణి.. దంతేశ్వరరావుతో విడాకులు కావాలని కోరడం, రెండేళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారానికి తల్లి విజయకుమారి, తాత బలుసాకు ఒప్పుకోకపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం.. సమస్య పరిష్కరిద్దామని హరిణిని సొర్లిగాంలోని ఇంటికి పిలిచారు. గత నెల 30వ తేదీ రాత్రి ఆమెను హత్య చేయాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో ఈనెల ఒకటో తేదీ రాత్రి హరిణిని హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. ప్లాన్‌లో భాగంగా దంతేశ్వరరావును సినిమాకు పంపించారు. అనంతరం హరిణిపై తల్లి, తాత దాడి చేశారు. హరిణి కాళ్లు, చేతులను తల్లి విజయకుమారి గట్టిగా పట్టుకోగా, తాత బలుసాకు ఇనుపరాడ్డుతో తల వెనుకభాగంలో గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై మృతిచెందింది. కొంతసేపటి తరువాత దంతేశ్వరరావుకు సమాచారమిచ్చి రప్పించారు. రక్తపు మరకలు లేకుండా గుడ్డలతో తుడిచివేశారు. అనంతరం హరిణి గుండెపోటుతో మృతిచెందిందని గ్రామస్థులను నమ్మించి రాత్రికి రాత్రే దహనం చేశారు. ఈ ఘటనకు ముందు ప్రేమికుడు సుధానాగేంద్రకు సెల్‌ఫోన్‌కు హరిణి పంపిన సమాచారంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. మంగళవారం వలేసాగరం ఫ్లైఓవర్ వద్ద ఉన్న విజయకుమారి, బలుసాకు, దంతేశ్వరరావును అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ విజయ్‌కుమార్, కానిస్టేబుళ్లు ఉమామహేశ్వరరావు, లోకనాఽథం, మల్లేశ్వరరావు, గోవింద్‌లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రాము పాల్గొన్నారు.