పథకం ప్రకారమే చంపేశారు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:37 PM
శ్రీకాకుళం నగరంలోని ప్రకాష్‌నగర్ కాలనీలో ఈ నెల 4వ తేదీ రాత్రి హత్యకు గురైన కారు డ్రైవర్ ధర్మాన అసిరినాయుడు (46) కేసును పోలీసులు ఛేదించారు.
- వీడిన డ్రైవర్ అసిరినాయుడు హత్య కేసు
- మద్యం తాగి వేధిస్తున్నాడనే మట్టుబెట్టారు
- భార్యకు సహకరించిన కొడుకు, అల్లుడు
- ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు
శ్రీకాకుళం క్రైం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని ప్రకాష్‌నగర్ కాలనీలో ఈ నెల 4వ తేదీ రాత్రి హత్యకు గురైన కారు డ్రైవర్ ధర్మాన అసిరినాయుడు (46) కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే భార్య, కొడుకు, అల్లుడు కలిసి ఆయన్ను చంపేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. అసిరినాయుడు జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాకుళం ప్రకాష్‌నగర్ కాలనీలో భార్య విజయలక్ష్మి, కొడుకు మణికంఠతో ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. విజయలక్ష్మి ఓ హోటల్‌లో పని చేస్తుండగా, మణికంఠ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అసిరినాయుడు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి డబ్బుల కోసం భార్యాకుమారుడిని వేధిస్తుండేవాడు. ఇంటిలో విలువైన సామగ్రిని సైతం పగులగొట్టేవాడు. డబ్బులు కూడా తీసుకుపోయి తాగుతుండేవాడు. భర్త ప్రవర్తనపై విసిగిపోయిన విజయలక్ష్మి ఎలాగైనా ఆయన్ను అంతం చేయాలని కొడుకు మణికంఠ, అల్లుడు చల్లా రాజు సహకారం కోరింది. ఈ మేరకు ఈనెల 3న పథకం పన్నారు. 4వ తేదీ రాత్రి అసిరినాయుడు పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే భార్యతో డబ్బుల కోసం గొడవ పడి ఇంటిలోని సామాన్లు విసిరేశాడు. దీంతో అసిరినాయుడుపై భార్య ముందుగా కర్రతో దాడి చేసి తర్వాత కత్తిపీటతో తలపై, శరీరంపై కొట్టింది. ఇంకా చావకపోవడంతో ముందుగా తెచ్చుకున్న పురుగు మందును కొడుకు, అల్లుడు కలిసి అసిరినాయుడు నోటిలోపోశారు. అనంతరం ఆయన నోరు మూసి, కాళ్లు, చేతులు పట్టుకొని హతమార్చారు. ఈ నేరాన్ని తాను చేసినట్టు పోలీసుల వద్ద అంగీకరిస్తానని విజయలక్ష్మి వారికి చెప్పింది. దీనిపై ఏమీ తెలియనట్లు మణికంఠ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఒంటిపై ఉన్న గాయాలను చూసి హత్యలో కుటుంబ సభ్యుల పాత్రపై టూటౌన్ సీఐ ఈశ్వరరావు లోతైన దర్యాప్తు చేపట్టారు. కొడుకు, అల్లుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు విజయలక్ష్మి, మణికంఠ, రాజును అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు.