బంగారం కోసమే చంపేశారు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:15 AM
ఆ వృద్ధురాలు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. ఇటీవల శుభకార్యం నిమిత్తం స్వగ్రామం వచ్చింది.
- చిన్నమ్మడు హత్య కేసును ఛేదించిన పోలీసులు
- కుటుంబ సభ్యులతో కలిసి మహిళా న్యాయవాది ఘాతుకం
- ఆమెతో పాటు మరో నలుగురు అరెస్టు
- రూ.38 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి
నరసన్నపేట/శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఆ వృద్ధురాలు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. ఇటీవల శుభకార్యం నిమిత్తం స్వగ్రామం వచ్చింది. ఇదే సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌కు అవసరమైన నోటరీ చేయించేందుకు ఓ మహిళా న్యాయవాది వద్దకు వెళ్లింది. ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలు చూసి ఆ న్యాయవాదికి దుర్బుద్ధి పుట్టింది. పక్కా ప్రణాళికతో కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధురాలి తలపై సుత్తితో కొట్టి.. తువ్వాలతో గొంతు నులిపి హతమార్చారు. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి సాగునీటి కాలువలో పడేశారు. అనంతరం బంగారాన్ని పంచుకున్నారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మహిళా న్యాయవాదితో పాటు నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన చింతు చిన్నమ్మడు (70) ఈ హైదరాబాద్‌లో తన కుమారులతో ఉంటూ అప్పుడప్పుడు స్వగ్రామం వచ్చి వెళ్తుండేది. ఈనెల 11న అల్లాడపేటకు వచ్చిన ఆమె.. 17న గ్రామంలో జరిగిన ఒక శుభకార్యక్రమానికి బంగారు ఆభరణాలు ధరించి హాజరైంది. అదే రోజు 11.30 గంటలు సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్టీసీ బస్సులో నరసన్నపేట వెళ్లింది. నోటరీ అవసరం కావడంతో గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న మహిళా న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్లింది. అనంతరం ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 19న చిన్నమ్ముడు మరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జలుమూరు పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేశారు. ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలియడంతో హత్య కోణంలో కూడా దర్యాప్తు సాగించారు. కేసును ఛేదించేందుకు ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆధునిక సాంకేతిక టెక్నాలజీ వినియోగించారు. శాస్ర్తీయ దర్యాప్తు చేపట్టి సీడీఆర్ విశ్లేషణ, ట్రాకర్ డాగ్ సహాయం, కారు ట్రాకింగ్ హిస్టరీ, డ్రోన్, క్లూస్ టీమ్ విశ్లేషణ, స్ధ్థానిక సమాచారం సేకరణపై ఆధారాలను సమగ్రంగా విశ్లేషించి నిందితుల కదలికలు, పాత్రను నిర్ధారించి వారిని అరెస్టు చేశారు.
హత్య ఇలా చేశారు..
బంగారం ఆభరణాలు ధరించి ఇంటికి వచ్చిన చిన్నమ్మడును చూసి మహిళా న్యాయవాది ధనలక్ష్మి (ఏ2)కి దురాశ కలిగింది. తన సోదరుడు, స్టాంప్ వెండర్ బెండి అచ్చుతరావు(ఏ1), పెద్దకుమారుడు, అడ్వకేట్ కింతలి గణేష్(ఏ3), మేనల్లుడు, డిగ్రీ విద్యార్థి బెండి లక్ష్మీనారాయణ(ఏ4), చిన్నకుమారుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కింతలి మణికంఠ(ఏ5) పథకం రూపొందించారు. చిన్నమ్మడు న్యాయవాది ఇంటిలోని బాత్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలో అచ్చుతరావు ఆమెను అనుసరించి మెడ పట్టుకుని వెనుక నుంచి తలపై సుత్తితో కొట్టాడు. అనంతరం ధనలక్ష్మి, గణేష్ అక్కడికి చేరుకుని చిన్నమ్మడు మెడకు తువ్వాలు బిగించి లాగారు. మళ్లీ ధనలక్ష్మి సుత్తితో బలంగా కొట్టడంతో చిన్నమ్మడు అక్కడికక్కడే మృతిచెందింది. వీరికి లక్ష్మీనారాయణ, మణికంఠ కూడా సహకరించారు. అనంతరం చిన్నమ్మడు వద్ద గల బంగారు, వెండి ఆభరణాలు అపహరించి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి దుప్పటితో చుట్టి అక్కడ నుంచి తరలించారు. గణేష్ తెల్లని కారు అద్దెకు తీసుకుని మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించాడు. హిరమండలం మండలం పిండ్రువాడ సమీపంలో బ్రిడ్జి కింద తంపర కాలువలో పడేశాడు. అనంతరం బంగారం ఆభరణాలను నిందితులు పంచుకున్నారు.
తిలారు వద్ద నిందితుల అరెస్టు
నిందితులు రెండు ద్విచక్ర వాహనాల మీద బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తిలారు రైల్వేస్టేషన్ వైపు వెళ్తుండగా నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారినుండి రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలతో పాటు కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇతరుల పాత్ర , ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. అచ్చుతరావు, ధనలక్ష్మి 2008లో జంట హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. కేసును ఛేదించిన అదనపు ఎస్పీ (క్రైం) పి.శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు అశోక్‌బాబు, గణేష్, రంజిత్, అనిల్‌కుమార్‌తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఆభరణాలు ధరించి ఒంటిరిగా వెళ్లొద్దు: ఎస్పీ
బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లే సమయంలో మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అవసరం లేకుండా అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు ధరించి ఒంటిరిగా వెళ్లకూడదన్నారు. శుభకార్యాలు,వేడుకులకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులతో కలిసి వెళ్లాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదిలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సంప్రదించాలని ఎస్పీ సూచించారు.