టోకెన్లు ఇస్తారు.. ఆడిస్తారు!
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:15 AM
Gambling camps on the Andhra Pradesh-Odisha border ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో జూదకేంద్రాలు జోరుగా నడుస్తున్నాయి. నిర్వాహకులు తమ వాహనాల్లో వచ్చి అక్కడికి తరలిస్తున్నారు. నగరంలోని న్యూకాలనీ, రామలక్ష్మణ జంక్షన్ ప్రాంతాలకు కొన్ని కార్లు వచ్చి జూదరులను తీసుకెళ్తున్నట్టు సమాచారం. ముందుగానే సమాచారం అందుకున్న వారిని ప్రత్యేక వాహనాల్లో ఒడిశాలోని గజపతి జిల్లా పరిధిలోని పర్లాకిమిడి, రాణిపేట, వసుంధర తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
డబ్బంతా పోతే అప్పు కూడా ఇచ్చేస్తారు
అధిక వడ్డీతో ప్రామిసరీ నోటు రాయిస్తే చాలు
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జూద శిబిరాలు
ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్న నిర్వాహకులు
రూ.5వేల నుంచి రూ.3 లక్షల వరకు టోకెన్లు
శిబిరంలోనే జూదరులకు సకల సౌకర్యాలు
పేకాట ఆడాలని ఉందా? ఇక్కడి పోలీసుల నిఘా భయపెడుతోందా? అయితే ఒడిశా సరిహద్దుల్లో స్థావరాలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు నిర్వాహకులు. ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి.. శిబిరాల్లో కూర్చోబెట్టి.. నగదుకు బదులు టోకెన్లు ఇచ్చి ఆడిస్తున్నట్టు సమాచారం. రూ.5 వేల నుంచి రూ.3 లక్షల వరకు టోకెన్లు.. డబ్బులు అయిపోతే ప్రామిసరీ నోటు రాయించుకుని అప్పు కూడా ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి):
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో జూదకేంద్రాలు జోరుగా నడుస్తున్నాయి. నిర్వాహకులు తమ వాహనాల్లో వచ్చి అక్కడికి తరలిస్తున్నారు. నగరంలోని న్యూకాలనీ, రామలక్ష్మణ జంక్షన్ ప్రాంతాలకు కొన్ని కార్లు వచ్చి జూదరులను తీసుకెళ్తున్నట్టు సమాచారం. ముందుగానే సమాచారం అందుకున్న వారిని ప్రత్యేక వాహనాల్లో ఒడిశాలోని గజపతి జిల్లా పరిధిలోని పర్లాకిమిడి, రాణిపేట, వసుంధర తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ నిర్వహించే పేకాట శిబిరాలకు అనుమతులు ఉన్నాయంటూ కొందరిని నమ్మబలికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. కాగా వసుంధర సమీపంలోని దేబిడి గ్రామం వద్ద ఉన్న ఓ క్లబ్‌పై అక్కడి పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాడి నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన వారే ఎక్కువగా పట్టుబడ్డారు. ఇలాంటి జూదశిబిరాలు ఆ ప్రాంతంలో ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం వ్యక్తే అక్కడ నిర్వాహకుడు!
గజపతి జిల్లా పర్లాకిమిడి సమీపంలోని వసుంధర వద్ద నిర్వహిస్తున్నట్టు చెబుతున్న ఓ పేకాట క్లబ్‌కు శ్రీకాకుళం నగరంలోని న్యూకాలనీకి చెందిన వ్యక్తి నిర్వాహకుడిగా ఉన్నట్టు సమాచారం. న్యూకాలనీ డైమాండ్ పార్క్ వద్ద రెండు, మూడు కార్లలో పేకాటరాయుళ్లను అక్కడికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు బయలుదేరిన వాహనాలు రాత్రి 8 గంటల సమయంలో తిరిగి శ్రీకాకుళం చేరుతున్నట్టు సమాచారం. ఆ క్లబ్‌లో రమ్మీ ఆడించేందుకు రూ.5 వేల నుంచి రూ.3 లక్షల వరకు విలువైన టోకెన్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆటలో గెలిచిన వారి టోకెన్లను అక్కడే నగదుగా మార్చి చెల్లిస్తున్నట్టు సమాచారం. ఒక్క ఆటకు సుమారు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డబ్బులు అయిపోయిన వారికి నిర్వాహకులే అప్పులు ఇచ్చి, ప్రామిసరీ నోట్లు రాయించుకుని అధిక వడ్డీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శిబిరానికి వచ్చే వారికి మద్యం, భోజనం తదితరాలను బోయ్‌ల ద్వారా అందిస్తున్నట్టు సమాచారం. నెలకు నిర్వాహకులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
రాణిపేటలో ‘సూట్’.. భారీగా నగదు
పర్లాకిమిడి సమీపంలోని రాణిపేట జీడితోటల్లో నిర్వహిస్తున్నట్టు చెబుతున్న ‘సూట్’ ఆటకు శ్రీకాకుళం జిల్లా నుంచి భారీగా పేకాటరాయుళ్లు తరలివెళ్తున్నట్టు సమాచారం. శ్రీకాకుళం నగరంతో పాటు పాలకొండ, నరసన్నపేట ప్రాంతాల నుంచి ఒక్కోసారి సుమారు 20 కార్లలో 30 నుంచి 50 మంది వరకు జూదరులను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కరోజులో సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆట సాగుతున్నట్టు సమాచారం. ఈ ఆటలో టోకెన్ల వినియోగం ఉండదని.. నేరుగా నగదు లావాదేవీలే జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష టేబుళ్లతో రమ్మీ తదితర ఆటలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తోటలు, ఏకాంత ప్రాంతాల్లో నిర్వహించే ఈ ఆటకు ముందుగా ప్రవేశ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుందని, నిర్వాహకులు భోజనం, టీ, బిస్కెట్లు తదితర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.
రోజుకో స్థావరం
గజపతి జిల్లాలో కొండలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో జూద శిబిరాల నిర్వాహకులకు అనుకూలంగా మారుతున్నట్టు సమాచారం. రోజుకో ప్రాంతాన్ని మార్చుకుంటూ శిబిరాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శిబిరాలకు వచ్చే వాహనాలను ప్రధాన రహదారులకు దూరంగా నిలిపి, అక్కడి నుంచి నిర్వాహకుల వాహనాల్లోనే లోపలకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, మందస, పాతపట్నం, కోటబొమ్మాళి, నందిగాం, కొత్తూరు, కంచిలి, కవిటి తదితర ప్రాంతాల నుంచి ఈ శిబిరాలకు వెళ్తున్నట్టు సమాచారం. కాగా జూదానికి అలవాటుపడిన కొందరు వ్యక్తులు అప్పులపాలై ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. పేకాటలో సర్వస్వం కోల్పోయి కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
రెండు రాష్ట్రాల పోలీసుల సమన్వయం అవసరం
సరిహద్దు దాటి జూద శిబిరాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ, ఒడిశా పోలీసుల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. శిబిరాల నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న వ్యక్తులు, జూదానికి వెళ్లేవారిని తరలించే వాహనాలపై నిఘా పెంచితే ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.
నిఘా పెంచాం
చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పేకాట డెన్లు, జూద శిబిరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెంచాం. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని నియమించాం. వారు పేకాట డెన్లపై దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్కడైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే 112 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలి.
- శ్రీనివాసరావు, ఏఎస్పీ (కైరం), శ్రీకాకుళం