జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:55 PM
JEE Mains results జేఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ పేపర్-1 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు గత నెల 21 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 3,400 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కాగా.. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన పర్సంటైల్ స్కోరు దక్కించుకున్నారు.
జిల్లా విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు
నరసన్నపేట/ కంచిలి/ అరసవల్లి/ వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): జేఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ పేపర్-1 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు గత నెల 21 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 3,400 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కాగా.. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన పర్సంటైల్ స్కోరు దక్కించుకున్నారు.
నరసన్నపేట పట్టణానికి చెందిన అల్లు రోహిత్ 99.97 పర్సంటైల్ సాధించాడు. రోహిత్ నరసన్నపేటలో ఒక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివాడు. ఆరు, ఏడు తరగతులు నరసన్నపేట నారాయణ స్కూల్‌లో, ఎనిమిది నుంచి ఇంటర్ వరకు విశాఖ నారాయణలో చదివాడు. తండ్రి అల్లు షణ్ముఖరావు.. పోలాకిలోని ప్రైవేటు డైట్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. తల్లి లలితాంబ గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌లో మరింత ప్రతిభ కనపరిచి టాప్ ఐఐటీ కళాశాలలో సీటు సాధించడమే తన లక్ష్యమని రోహిత్ చెప్పాడు.
నరసన్నపేట మండలం తండేలువానిపేట గ్రామానికి తండేల పవన్‌సాయి 99.95 పర్సంటైల్ సాధించాడు. ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు నరసన్నపేట, విశాఖపట్నంలోని నారాయణ స్కూల్‌లో చదివాడు. తల్లిదండ్రులు జనార్దనరావు, పద్మావతి ఇద్దరూ.. ఉపాధ్యాయులే. అడ్వాన్స్‌లో మంచి స్కోర్ సాధించి సీఎస్ ముంబైలో సీటు సాధించడమే తన లక్ష్యమని పవన్‌సాయి తెలిపాడు.
కంచిలి పట్టణానికి చెందిన గుడ్ల పైడిరాజు, శైలజ దంపతుల కుమార్తె గుడ్ల సాహితి 99.6815 పర్సంటైల్ సాధించింది. సాహితి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు జేఎంజే పాఠశాలలో, ఆరు నుంచి 8వ తరగతి వరకు కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదో తరగతి, ఇంటర్ వేలివెన్నులోని శశిలో చదివినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీకాకుళం నగరానికి చెందిన నరవ రోషన్‌రామ్.. 99.63 పర్సంటైల్ సాధించాడు. రోషన్‌రామ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. రోషన్‌రామ్ తండ్రి నరవ మహేష్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. తల్లి అరుణకుమారి ప్రభుత్వ ఉపాధ్యాయిని. రోషన్‌రామ్‌ను శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం అభినందించింది.
కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు గ్రామానికి చెందిన మెట్ట వెంకటసాయి సరాగ్.. 99.59 పర్సంటైల్ సాధించాడు. ఈ విద్యార్థి తండ్రి మెట్ట పాపారావు వజ్రపుకొత్తూరు మండల పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి పద్మలత పోలాకిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం పొడుగుపాడు గ్రామం కాగా.. శ్రీకాకుళంలో స్థిరపడ్డారు.
కంచిలికి చెందిన బత్తుల వంశీకృష్ణ 99.4149 పర్సంటైల్ సాధించాడు. వంశీకృష్ణ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. తండ్రి రమేష్ కవిటి మండలం శిలగాం జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్( లెక్కలు). తల్లి గాయత్రి ఎంఎస్ పల్లి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు).
కంచిలికి చెందిన ఇప్పిలి ప్రవీణ్, శ్రీలక్ష్మీ దంపతుల కుమారుడు రాహుల్ 98.5123 పర్సంటైల్ సాధించాడు. రాహుల్ ఒకటి నుంచి 9వ తరగతి వరకు కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. పదో తరగతి గుడివాడ కేకేఆర్ గౌతంలో, ఇంటర్ రాజమండ్రి తిరుమలలో చదివాడు. మెయిన్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు.