తవ్వేశారు.. వదిలేశారు
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:37 PM
ఎచ్చెర్లలో జలజీవన్ మిషన్ పనుల్లో భాగంగా ప్రతిఇంటికీ కుళాయి ఏర్పాటు లక్ష్యంగా పైప్‌లైన్లు వేస్తున్నారు.
- జల్‌జీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యం
- రోడ్లపై మట్టి పోగులు విడిచిపెట్టడంతో ప్రమాదాలు
ఎచ్చెర్ల రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలో జలజీవన్ మిషన్ పనుల్లో భాగంగా ప్రతిఇంటికీ కుళాయి ఏర్పాటు లక్ష్యంగా పైప్‌లైన్లు వేస్తున్నారు. దీనికోసం ఎక్స్‌కవేటర్‌తో రోడ్ల పక్కన గోతులు తవ్వేశారు. పైపులు వేసిన తరువాత ఆ గోతులను పూడ్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పూర్తిస్థాయిలో గోతులను పూడ్చకుండా వదిలేస్తుండడంతో రోడ్లపై మట్టిపోగులు కనిపిస్తున్నాయి. ఎచ్చెర్ల ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్డు నుంచి సాయిబాబా టెంపులకు వెళ్లే రోడ్డులో అయితే రోడ్డు సగం వరకు మట్టి ఉండిపోయింది. దీంతో అటువైపు వెళ్తున్న వారికి ఇబ్బందిగా మారింది. రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి మట్టి మొత్తం రోడ్డుపైకి వచ్చేసింది. దీనివల్ల వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రోడ్ల పక్కన బెర్మ్‌లు సైతం సక్రమంగా ఉండడం లేదు. ఇప్పటికైనా రోడ్లపై మట్టి లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎంపీడీవో హరిహరరావు మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీ రోడ్డు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.