అటు చూడరు.. ‘బెల్టు’ తీయరు
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:36 AM
Management of belt shops జిల్లాలో పలుచోట్ల బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొంతమంది ఎక్సైజ్ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యంతో జాతీయ రహదారి పక్కన దాబాలు, మారుమూల గ్రామాల్లోని బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
జిల్లాలో పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపుల నిర్వహణ
దాబాల్లో జోరుగా మద్యం విక్రయాలు
కానరాని నిబంధనలు
టెక్కలి రూరల్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొంతమంది ఎక్సైజ్ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యంతో జాతీయ రహదారి పక్కన దాబాలు, మారుమూల గ్రామాల్లోని బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో 288 మద్యం షాపులతోపాటు గీతకార్మికులకు మరో 18 షాపులు కేటాయించారు. అలాగే 18 బార్లకు అనుమతులు ఇచ్చారు. కాగా జాతీయ రహదారికి ఆనుకుని మద్యం షాపులకు అనుమతి లేకపోయినా.. కొంతమంది యజమానులే.. తమ బంధువుల ద్వారా బెల్టుషాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కోసీసాపై 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో వైన్‌షాపు కింద 30 దాకా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిషాపులకు పర్మిట్ రూములకు అనుమతి లేకపోయినా.. దుకాణం పక్కనే గదులు నిర్మించి అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్ని దాబాల్లో కూడా మందుబాబుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం వైన్‌షాపులకు అనుమతి ఇచ్చిన తర్వాత కొన్నిరోజులపాటు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు హడావుడి చేశారు. మద్యం విక్రయదారులు, రవాణా చేసేవారిపై కేసులు పెట్టారు. ప్రస్తుతం మద్యం దుకాణాల యజమానులు సిండికేట్‌గా మారి.. కొంతమంది అధికారులకు మామూళ్లు సమర్పిస్తుండడంతో అటువంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు చేసిన సమయంలో బెల్టుషాపుల్లో భారీగా మద్యం దొరికినా.. నాలుగైదు సీసాలే పట్టుబడినట్టు చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం షాపు యజమానికి రూ.5 లక్షల జరిమానా పడుతుందనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రమాదాలకు కారణం
జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు సుమారు 175 కి.మీ మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారి పక్కన సుమారు 75 దాబాలు ఉన్నాయి. అధికంగా ఒడిశా వ్యాపారులు దాబాలను నిర్వహిస్తున్నారు. ఈ దాబాల్లో రాత్రివేళ లారీడ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు మద్యం తాగుతున్నారు. ఆపై వాహనాలు నడుపుతుండడంతో.. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది యువకులు దాబాల వద్దే పార్టీల పేరుతో మద్యం సేవించి తగదాలకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించి దాబాలు, బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
దాడులు చేస్తాం
బెల్టుషాపులను కట్టడి చేశాం. జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం తాగడానికి, విక్రయించడానికి అనుమతి లేదు. దాబాల్లో దాడులు చేసి.. మద్యం విక్రయించేవారిపై కేసులు నమోదు చేస్తాం.
ఎస్.కె.మీరాసాహెబ్, సీఐ టెక్కలి, ఎక్సైజ్‌శాఖ