Share News

అద్దె అడగరు.. వారు ఇవ్వరు

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:02 AM

Arrears piling up in shopping complexes శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలో మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణాలకు సంబంధించి అద్దె వసూలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా రూ.కోట్లలో అద్దె బకాయిలు పేరుకుపోతున్నాయి. కార్పొరేషన్‌ ఆదాయానికి గండి పడుతోంది.

అద్దె అడగరు.. వారు ఇవ్వరు
శ్రీకాకుళంలో మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణాలు

  • శ్రీకాకుళం కార్పొరేషన్‌లోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో పేరుకుపోతున్న బకాయిలు

  • వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యం

  • లీజుదారుల ఇష్టారాజ్యం

  • నిబంధనలకు విరుద్ధంగా కొన్ని దుకాణాల్లో మార్పులు

  • శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలో మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణాలకు సంబంధించి అద్దె వసూలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా రూ.కోట్లలో అద్దె బకాయిలు పేరుకుపోతున్నాయి. కార్పొరేషన్‌ ఆదాయానికి గండి పడుతోంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు సంబంధించి 12 షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో 343 దుకాణాలు ఉన్నాయి. అధికారులు మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించి.. వీటిని లీజు ప్రాతిపదికన వర్తకులకు ఇస్తారు. గడువు ముగిసినా.. లీజు పొడిగిస్తూ.. కొంతమంది వర్తకులు సుదీర్ఘకాలంగా ఈ దుకాణాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఇంకొందరు ఈ దుకాణాలను లీజుకు తీసుకుని.. సబ్‌లీజుకు ఇచ్చి.. లాభాలు పొందుతున్నారు. కార్పొరేషన్‌కు మాత్రం సకాలంలో అద్దె చెల్లించడం లేదు. లీజుదారులు ప్రతినెలా పదో తేదీలోగా కార్పొరేషన్‌ కార్యాలయంలో అద్దె చెల్లించాలి. కానీ కొంతమంది సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో సుమారు రూ.5కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. అధికారుల ఉదాసీనతతో అద్దెబకాయిల వసూలు ప్రక్రియ సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మూడు, నాలుగు నెలలుగా అద్దె చెల్లించని లీజుదారులకు నోటీసులు జారీ చేయడం మినహా కఠినచర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణాలకు తాళాలు వేసేందుకు అధికారులు వెళ్లిన సందర్భాల్లో బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని లీజుదారులు విజ్ఞప్తి చేయడంతో వారు వెనక్కి వచ్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

  • పొట్టిశ్రీరాములు మార్కెట్‌లో మొత్తం 204 దుకాణాలను నిర్మించారు. వీటిలో వర్తకుల సౌకర్యార్థం, మార్కెట్‌ అభివృద్ధి కోసం ఇటీవల 80 దుకాణాలను తొలగించి పునఃనిర్మాణాలు చేపడుతున్నారు. మరోవైపు పొట్టిశ్రీరాములు మార్కెట్‌ షాప్‌లు, ఇతర షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లోని పైఅంతస్తుల్లో సుమారు 35 దుకాణాలను లీజుకు తీసుకునేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటిపై కూడా అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • నిబంధనలకు తూట్లు...

  • కొందరు లీజుదారులు కార్పొరేషన్‌ సిబ్బంది అనుమతి లేకుండానే దుకాణాల్లో ఇష్టానుసారంగా నిర్మాణ పనులు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండు దుకాణాలను లీజుకు తీసుకొని మధ్యలో గోడలను తొలగించి ఒకే దుకాణంగా మార్చడం, అదనపు నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని సమాచారం. కొన్నిషాపులు దశాబ్దం కంటే ముందు నిర్మించనివి కావడంతో వాటి భద్రతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాత భవనాల్లో అనుమతి లేకుండా మార్పులు చేస్తే భవిష్యత్‌లో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

  • బకాయిల వసూళ్లపై దృష్టి

  • శ్రీకాకుళం నగర పరిధిలోని మునిసిపల్‌ కాంప్లెక్స్‌ల్లో దుకాణాల అద్దె బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రతినెలా లీజుదారులు సకాలంలో అద్దె చెల్లించేలా చర్యలు చేపడతాం. అవసరమైతే బకాయిలను చెల్లించని దుకాణాలకు తాళాలు వేస్తాం. నిబంధనల మేరకు లీజు రద్దు చేసి తిరిగి వాటికి టెండర్లు నిర్వహించి ఇతరులకు దుకాణాలను కేటాయిస్తాం. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మార్పులు చేసిన దుకాణాలను గుర్తించి చర్యలు చేపడతాం.

  • - శ్రావణ్‌కుమార్‌, కమిషనర్‌, శ్రీకాకుళం కార్పొరేషన్‌

Updated Date - Sep 03 , 2026 | 12:02 AM