తడి ఇసుకనూ వదల్లే!
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:20 AM
Illegal sand mining and transport from rivers శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. నాగావళి, వంశధార నదుల నుంచి తడి ఇసుకను భారీగా తవ్వి తరలిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ), వాల్టా చట్టాల ప్రకారం నదిలో నీటి ప్రవాహం ఉన్న ప్రాంతం (నది గర్భం) నుంచి నేరుగా ఇసుక తీయడం నేరం. కానీ, ఇసుకాసురులు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ నది లోపలి నుంచే ఇసుకను తవ్వేస్తున్నారు.
నాగావళి, వంశధార నదుల నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా
ఎన్జీటీ, వాల్టా, మోటారు వాహన చట్టాలకు తూట్లు
రహదారులపై పారుతున్న నీరు.. పాడవుతున్న తారురోడ్లు
ప్రమాదాల బారిన వాహనదారులు..
పట్టించుకోని సంబంధితశాఖల అధికారులు
శ్రీకాకుళం/ ఎచ్చెర్ల రూరల్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. నాగావళి, వంశధార నదుల నుంచి తడి ఇసుకను భారీగా తవ్వి తరలిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ), వాల్టా చట్టాల ప్రకారం నదిలో నీటి ప్రవాహం ఉన్న ప్రాంతం (నది గర్భం) నుంచి నేరుగా ఇసుక తీయడం నేరం. కానీ, ఇసుకాసురులు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ నది లోపలి నుంచే ఇసుకను తవ్వేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా తరలిస్తుండడంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ నీటిమయమై, ఇసుకతో నిండిపోతున్నాయి. శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం సమీపంలోని నాగావళి నది తీరం నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి బయలుదేరుతున్న ఇసుక ట్రాక్టర్లు కునుకుపేట, బాదుర్లపేట, కలెక్టరేట్, జిల్లాపరిషత్, ఏపీ హెచ్‌బీ కాలనీల మీదుగా పాత వంతెన దాటి హైవే ఎక్కేస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం, గార మండలాల్లో వంశధార నదిలోనూ ఇదే పరిస్థితి. నది గర్భం నుంచే నేరుగా ట్రాక్టర్లలో తడి ఇసుకను లోడ్ చేసుకుని దర్జాగా తరలిస్తున్నారు.
ప్రాణాలతో చెలగాటం..
వాస్తవానికి తడి ఇసుక రవాణా అనేది చట్టవిరుద్ధం. ఇసుక ట్రాక్టర్ల నుంచి కారే నీటితో తారురోడ్లు త్వరగా గుంతలు పడి దెబ్బతింటాయి. మరోవైపు రోడ్లపై ఇసుక, నీరు జారిపోవడం వల్ల ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయ్యి ప్రయాణికులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. వాహనం నుంచి ఏ పదార్థమూ కింద పడకుండా టార్పాలిన్ కవర్లు కప్పి రవాణా చేయాలి. ఇక్కడ పర్యావరణ, మైనింగ్, రవాణా, పోలీసు శాఖల కళ్లెదుటే.. బహిరంగంగా రోడ్లను నాశనం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఏ ఒక్క అధికారీ అడ్డుకునే సాహసం చేయడం లేదు. ఈ ఇసుక దందా కొందరు ప్రజాప్రతినిధులకు కనకవర్షం కురిపిస్తుండటంతో అటువైపు చూసేందుకు అధికారులు భయపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా తడి ఇసుకను తరలిస్తూ రోడ్లను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
చిలకపాలెం నుంచి విశాఖకు..
ఇసుక ఉచిత విధానానికి కొంతమంది తూట్లు పొడుస్తున్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం కేంద్రంగా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట, పొందూరు మండలం సింగూరు, తోటాడ, గోపీనగరం ప్రాంతాల్లో నాగావళి నది నుంచి ట్రాక్టర్లు ద్వారా ఇసుక తీసుకువస్తున్నారు. చిలకపాలెంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో, పక్క ఖాళీస్థలాల్లో పోగులు వేసి నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తున్నారు. టన్ను ఇసుక రూ.450 చొప్పున విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా పక్క జిల్లాలకు అనధికారంగా ఇసుక తరలింపు నేరం. మరోపక్క 10 టైర్ల వాహనంలో 25 టన్నులకు మించి (వాహనంతో కలిపి) బరువు తీసుకెళ్లకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ఎచ్చెర్ల తహసీల్దార్ బలగ గోపాల్ వద్ద ప్రస్తావించగా.. ‘ఇసుక పోగులు వేసి ఇతర ప్రాంతాలకు తరలించరాదు. నిబంధనలు అతిక్ర మిస్తే చర్యలు తీసుకుంటాం. ఇసుక పోగులు కనిపిస్తే సీజ్ చేస్తాం. చిలకపాలెం పరిసరాల్లో పర్యవేక్షణ పెంచుతాం. రీచ్‌ల్లో సైతం తనిఖీలు చేస్తామ’ని తెలిపారు.