ఫుట్‌పాత్‌లనూ వదల్లే!
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:18 AM
Shops encroaching on the road జిల్లాలోని కొంతమంది వ్యాపారుల తీరుతో రహదారులు ఆక్రమణకు గురవుతున్నాయి. జిల్లాకేంద్రం శ్రీకాకుళంతోపాటు, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ, నరసన్నపేట తదితర పట్టణాల్లో రహదారులను ఆక్రమించి ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో రోడ్డెక్కిన వ్యాపారాలు
రహదారిని ఆక్రమించి.. దుకాణాలు
ఆపై ఆరుబయటే సామగ్రి విక్రయాలు
ట్రాఫిక్ రద్దీతో ప్రజలకు ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
పలాస-కాశీబుగ్గలో కేటీ రోడ్డును కొన్నాళ్ల కిందట 80 అడుగులకు విస్తరించారు. రోడ్డుకు ఇరువైపులా ఐదు అడుగుల వెడల్పుతో పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్ కూడా సుందరంగా తీర్చిదిద్దారు. కాగా.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల యజమానులు ఫుట్‌పాత్ ఎక్కడుందో కనీసం కనిపించకుండా షాపు సామగ్రి బయట పెడుతూ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఫుట్‌పాత్ ఆక్రమణతోపాటు షాపుల ఎదుట వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తుండడంతో ఈ రహదారి 50 అడుగులకు చేరిపోయింది. ఇరుకు రహదారితో తరచూ ప్రజలు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడి.. ప్రమాదాలకు గురవుతున్నారు.
...........
శ్రీకాకుళం అర్బన్/ పలాస/ నరసన్నపేట, జూన్ 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొంతమంది వ్యాపారుల తీరుతో రహదారులు ఆక్రమణకు గురవుతున్నాయి. జిల్లాకేంద్రం శ్రీకాకుళంతోపాటు, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ, నరసన్నపేట తదితర పట్టణాల్లో రహదారులను ఆక్రమించి ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఫుట్‌పాత్‌లను సైతం వదలకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇంకొందరు రోడ్లపైనే తోపుడుబళ్లు ఉంచి.. విక్రయాలు చేస్తున్నారు. దీంతో రహదారులు ఇరుగ్గా మారి.. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి...
శ్రీకాకుళం నగర పాలక సంస్థలో కళింగ రహదారి, జీటీరోడ్డు, అంబేడ్కర్ కూడలి, పొట్టిశ్రీరాములు మార్కెట్, ఏడురోడ్ల జంక్షన్, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భారీ వాణిజ్య సముదాయాలతో పాటు 430 దుకాణాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే రోడ్డును ఆక్రమించి షాపులు నిర్మించారు. అది చాలదన్నట్టు రోడ్డుపైనే బెంచీలు ఏర్పాటు చేసి వాటిపై అమ్మకానికి ఉత్పత్తులు ఉంచుతున్నారు. మరోవైపు భారీగా షాపింగ్ కాంప్లెక్స్‌లు దాదాపు 30 వరకు ఉన్నాయి. ఎక్కడా నింధనలు మేర నిర్మాణాలు చేపట్టలేదు. ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు లేవు. దీనితో ఇరుకు సందులుగా ఉండే రహదారులపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. ప్రధాన మార్కెట్లు, బంగారం దుకాణాలు ఉండే రోడ్లలో కనీసం మనిషి తప్పుకొనేందుకు కూడా వీలుండడం లేదు. ఈక్రమంలో ట్రాఫిక్ సమస్యతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే శ్రీకాకుళం నగరంలో పండ్ల వ్యాపారంతో పాటు ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మరోవైపు ఆహారంతో పాటు కూరగాయల విక్రయాలు అధికం. దాదాపు 500 వరకు తోపుడు బండ్లు ఉన్నాయి. నగరంలో ప్రతిచోటా ఇవి దర్శనం ఇస్తుంటాయి. ఒకవైపు పెరిగిన దుకాణాల ఆక్రమణలు, ఇంకోవైపు ఫుట్‌పాత్ వ్యాపారాలు, మరోవైపు పశువుల సంచారంతో శ్రీకాకుళం నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ చిక్కులే. ఇంత జరుగుతున్నా నగకపాలక సంస్థకు సంబంధించి టౌన్‌ప్లానింగ్ అధికారులు కానీ, ప్రత్యేక ట్రాఫిక్ విభాగం పోలీసులు కానీ స్పందిస్తున్న దాఖలాలు లేవు. దీనితో ఈ షాపుల పేరుతో మార్జిన్ దాటి రోడ్లుపైకి వస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
డ్రైనేజీపైనే షాపులు
నరసన్నపేట పట్టణంలో జనాభాతోపాటు వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నరసన్నపేట పట్టణానికి రోజుకు 10వేల మంది వరకు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తారు. దీనికి అనుగుణంగా రోడ్లు విస్తరించపోవడంతో ట్రాఫిక్ సమస్యల ఉత్పన్నమవుతోంది. మరోవైపు కాలువలు ఆక్రమణ చేపట్టి వ్యాపారులు రోడ్డుమీద దుకాణాలు ఏర్పాటు చేయడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జమ్ముజంక్షన్ జంక్షన్ నుంచి సత్యవరం జంక్షన్, కాలేజీ రోడ్డు, బజారువీఽదుల్లో రోడ్ల మీద వ్యాపారాలు సాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. మెయిన్ రోడ్డుమీద తోపుడుబళ్లు, వ్యాపారులు రోడ్డెక్కి వ్యాపారాలు సాగిస్తున్నారు. రానుపోను వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతోంది. నరసన్నపేట పాతబస్టాండ్‌లో బ్యాంకులు, హాటల్స్ ముందు సగం రోడ్డువరకు వాహనాల పార్కింగ్ చేపడుతున్నారు. దీంతో ప్రజలు నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన దుస్థితి దాపురించింది. నరసన్నపేటలోని లక్ష్మీథియేటర్ జంక్షన్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు కాలేజీ రోడ్డులో కూరగాయలు, ఇతర మార్కెట్ అంతా రోడ్డెక్కెంది. ఇదే మార్గంలో భారీ వాహనాలు కూడా నిత్యం రాకపోకలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లను వ్యాపారులు ఆక్రమించేసినా, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా పోలీసులు, అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈవిషయంపై సీఐ ఎం. శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా నరసన్నపేట మెయిన్‌రోడ్డు మీద నిర్దేశించిన స్థలం కన్నా ముందుకు వచ్చి వ్యాపారాలు కొనసాగిస్తే అపరాధ రుసం విధిస్తామని తెలిపారు.
ఆక్రమణలు.. ఆపై పార్కింగ్
జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 80 అడుగుల రోడ్డును నిర్మించారు. దానికి ఆనించి ఐదు అడుగుల మేర కాలువపై ఫుట్‌పాత్ కూడా నిర్మాణం చేపట్టారు. సంబంధిత షాపు యజమానులు మాత్రం ఫుట్‌పాత్‌తో పాటు పార్కింగ్ కోసం రోడ్డును కూడా ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్, పాతబస్టాండు, హైస్కూల్‌రోడ్డు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ముస్లిమ్-క్రిష్టియన్ శ్మశానం, శ్రీనివాసలాడ్జి జంక్షన్, మోర్ సెంటర్, అప్పయ్యదొరమార్గ్, వెంకటేశ్వర థియేటర్, జీడిపండు జంక్షన్, ఇందిరాచౌక్ ప్రాంతాలు అత్యంత రద్దీగా ఉండే రహదారులు. ఈ ప్రాంతంలోనే ముఖ్యంగా పార్కింగ్, రోడ్ మార్జిన్ కనిపించకుండా పోయింది. దీంతో ప్రజలు ఏది రోడ్డో, ఏది ఫుట్‌పాతో తెలియని అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై వాహనాలు పెట్టి షాపింగ్ చేస్తుండడం వల్ల వారి వాహనాలు ఏ పెద్ద వాహనాలకు బలవుతుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. వాస్తవానికి షాపుల నిర్వాహకులు పార్కింగ్‌కు స్థలాలు విడిచిపెట్టి నిర్మాణాలు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం రోడ్డు వరకూ షాపులు నిర్మించడం, రోడ్డుపై వాహనాల కోసం వినియోగించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా ఇందిరాజంక్షన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు, కాశీబుగ్గ జడ్‌పి హైస్కూల్ నుంచి పాతజాతీయరహదారి మంకినమ్మ మందిరం వరకూ రోడ్డు రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తు వచ్చే వాహనాలకు కనీసం దారి లేకుండా చేస్తుండడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం సంత రోజయితే అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. దీనిపై పోలీసు, మునిసిపల్ అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలి. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఉంచేలా.. ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు సాగించకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేకంగా దృష్టి
నగరంలో ఆ క్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఫుట్‌పాత్ వ్యాపారాలకు అనుమతులు లేవు. ప్రధాన రహదారులపై వాటిని ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్డు మార్జిన్ దాటి నిర్మాణాలు జరిపిన వ్యాపార వస్తవులు కనిపించినా కఠిన చర్యలు తప్పవు.
- హనుమంతు కూర్మారావు, కమిషనర్, శ్రీకాకుళం కార్పొరేషన్