Share News

వస్తుంటారు.. వెళ్తుంటారు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:05 AM

టెక్కలి మైనర్‌ ఇరిగేషన్‌ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

వస్తుంటారు.. వెళ్తుంటారు
ఖాళీగా ఉన్న డీఈఈ, ఏఈ కుర్చీలు

- సమయపాలన పాటించరు

- ఇదీ టెక్కలి మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారుల తీరు

- ఆరేళ్లుగా ఒకేచోట విధులు

టెక్కలి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): టెక్కలి మైనర్‌ ఇరిగేషన్‌ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు ఉద్యోగులు వస్తుంటారు.. వెళ్తుంటారని, లేదంటే ఆ రోజంతా వారి జాడే ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెక్కలి సబ్‌డివిజన్‌ పరిధిలో కొత్తూరు, సారవకోట, హిరమండలం, టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలు ఉన్నాయి. టెక్కలి సబ్‌డివిజన్‌ కార్యాలయంలో డీఈఈ, ఏఈ, సీనియర్‌, జూనియర్‌ సహాయకులు, ఉమన్‌ మజ్దూర్‌, సహాయకుడు పని చేస్తున్నారు. గురువారం ఉదయం 10.41గంటలకు ఈ కార్యాలయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా.. డీఈఈ, ఏఈ, సీనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ స్థాయి ఉద్యోగులు గైర్హాజరయ్యారు. వీరంతా ఇక్కడే ఏళ్ల తరబడి తిష్ఠవేశారు. వీరిని అడిగేవారు.. ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాదిలో వారు కేవలం నాలుగు ఆపరేషన్‌ అండ్‌ మెంటినెన్స్‌ పనులు (రూ.20లక్షల విలువ) మాత్రమే నిర్వహించారు. వాస్తవానికి మైనర్‌ ఇరిగేషన్‌ శాఖను ఒకప్పుడు పీడబ్ల్యూడీగా పిలిచేవారు. ప్రస్తుతం ఆ శాఖకు నిధులు కేటాయింపులు లేకపోవడంతో ఖాళీగా పడిఉంది. ఎప్పుడైనా కలెక్టర్‌ ఏదైనా అత్యవసర పనులు అప్పగిస్తే చేయడం, లేదంటే ఖాళీగా ఉండడం ఆ శాఖ వంతైంది. గతంలో ఈ శాఖ ఆధ్వర్యంలో చెరువుల అభివృద్ధి, మదుములు, రిటర్నింగ్‌ వాల్స్‌, సర్‌ప్లస్‌వైర్‌, గట్లు బలపరచడం, కాలువలు బాగుచేయడం వంటి పనులు జరిగేవి. అయితే, వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మైనర్‌ ఇరిగేషన్‌ శాఖకు పనులు లేకపోవడంతో ఆ ఉద్యోగులు, అధికారులు ఖాళీగా ఉంటున్నారు. ఎప్పుడో ఉన్నతాధికారులు, కలెక్టర్‌, ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నారని తెలిస్తే సమావేశాలకు హాజరుకావడం, లేకపోతే ఖాళీగా ఉండడం గత ఆరేళ్లుగా జరుగుతోంది. ఈ విషయమై మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ డీఈఈ ఎం.రంగనాయకులను వివరణ కోరగా.. ‘మా సిబ్బంది అందరూ వస్తుంటారు. ఈ ఏడాది రూ.20లక్షలతో నాలుగు ఆపరేషన్‌ అండ్‌ మెంటినెన్స్‌ పనులు మాత్రమే చేశారు. ప్రభుత్వం నుంచి మైనర్‌ ఇరిగేషన్‌ శాఖకు ఏ పనులు లేవు.’ అని అన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:05 AM