సచివాలయాలనూ వదలట్లే!
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:02 AM
Theft of computers, TVs, and valuable equipment సచివాలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఒక్క రణస్థలం మండలంలోనే రెండువారాల వ్యవధిలో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఊరికి దూరంగా ఉండే సచివాలయాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
కంప్యూటర్లు, టీవీలు, విలువైన సామగ్రి చోరీ
రణస్థలం మండలంలో వరుసగా ఘటనలు
రణస్థలం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 6న పాతర్లపల్లి సచివాలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి తాళాలు పగులగొట్టిన దుండగులు.. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, టీవీ తీసుకెళ్లిపోయారు.
ఈ నెల 18 రణస్థలం మండలం పిషిని సచివాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి.. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, టీవీలు, విలువైన ప్రింటర్లు.. తదితర సామగ్రి దొంగిలించుకుపోయారు.
ఈ నెల 19న అర్ధరాత్రి జేఆర్‌పురం -2 సచివాలయంలో దొంగలు పడ్డారు. ఇక్కడ కూడా తాళాలు పగులగొట్టి.. కంప్యూటర్లతోపాటు టీవీ, ప్రింటర్ ఎత్తుకెళ్లిపోయారు.
సచివాలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఒక్క రణస్థలం మండలంలోనే రెండువారాల వ్యవధిలో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఊరికి దూరంగా ఉండే సచివాలయాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. మిగతా ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా వీటికి నైట్ వాచ్‌మెన్ ఉండడు. సీసీ కెమెరాలు లేవు. అంతగా నిఘా ఉండదు. అందుకే చాలా సులువుగా సచివాలయ కార్యాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
జిల్లాలో 732 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో సగానికిపైగా సచివాలయాలు ప్రైవేటు భవనాల్లోనే నడుస్తున్నాయి. సచివాలయం సామర్ధ్యం బట్టి మూడు నుంచి నాలుగు వరకూ కంప్యూటర్లు అందించారు. ఆపై టీవీలు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ సదుపాయం కల్పించారు. ప్రింటర్‌తోపాటు విడిభాగాలు అందించారు. కానీ ప్రైవేటు భవనాల్లో నడుస్తుండడం, ఆపై సొంత భవనం అందుబాటులోకి వచ్చినా సీసీ కెమెరాలు లేవు. ఆపై నైట్ వాచ్‌మెన్‌లను సైతం ఏర్పాటు చేయలేదు. దీంతో దొంగతనాలు పెరుగుతున్నాయి. పోలీసులు సచివాలయాలపై ప్రత్యేక దృష్టి సారించి దొంగతనాలు అరికట్టేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉన్నాం
సచివాలయాల్లో వరుస చోరీల నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేశాం. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించాం. నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. చోరీల నియంత్రణతోపాటు విధ్వంస ఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉన్నాం.
- ఎం.అవతారం, సీఐ, రణస్థలం