నదినీ వదలట్లే!
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:19 AM
Encroachment of the Mahendratanaya మెళియాపుట్టి మండలంలో మహేంద్రతనయ నది ఆక్రమణకు గురవుతోంది. కొన్నిచోట్ల ఆక్రమణదారులు నదీ గర్భాన్ని కబ్జా చేసి పొలాలుగా మార్చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల నది గట్టును తవ్వేసి ఆ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆక్రమణకు గురవుతున్న మహేంద్రతనయ
జోరుగా మట్టి తవ్వకాలు
కొన్నిచోట్ల పొలాలుగా మార్చుస్తున్న వైనం
మెళియాపుట్టి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి మండలంలో మహేంద్రతనయ నది ఆక్రమణకు గురవుతోంది. కొన్నిచోట్ల ఆక్రమణదారులు నదీ గర్భాన్ని కబ్జా చేసి పొలాలుగా మార్చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల నది గట్టును తవ్వేసి ఆ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మెళియాపుట్టి మండల కేంద్రానికి ఆనుకుని అధికంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్ ఎదురుగా గత కొద్దిరోజులుగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టి చదును చేస్తున్నాడు. అయినా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహేంద్ర తనయ నది ఒడిశాలోని మహేంద్రగిరుల నుంచి వచ్చి మెళియాపుట్టి మండలం చాపర వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇది హిరమండలం వరకు ప్రవహిస్తుంది. ఆ ప్రాంతాల్లో కొంతమంది ఇటుకలు తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసి నదిలో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మరోవైపు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నది గట్లను తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. దీంతో నదికి అధికంగా వరదలు వచ్చే సమయంలో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. నదిలో మట్టి తవ్వకాలతో గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ గుంతల్లో నీరు చేరి అవి కనిపించక అందులో మునిగి పలువురు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి.
ఎక్కడ చూసినా వెంచర్లే..
మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి మెళియాపుట్టిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో మండలంలో ఎక్కడపడితే అక్కడే వెంచర్లు వెలుస్తున్నాయి. మండల కేంద్రానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికంగా వెంచర్లు వేస్తున్నాడు. ఇటీవల పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో కంకర తవ్వకాలు చేపట్టి వెంచర్లకు తరలిస్తున్నాడు. ఇది చాలదన్నట్లు మహేంద్ర తనయ నదిలో మట్టిని కూడా తవ్వేస్తున్నాడు. వెంచర్లలో మట్టి చదును చేసి అనుమతులు పొందకుండానే ప్లాట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అడుగు రూ.2లక్షలకు పైబడి అమ్మతున్నారంటే ఇక్కడ భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులతో తిరిగి వ్యాపారం కొనసాగించగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పార్టీ నాయకులతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ విషయమై తహసీల్దార్ బి.పాపారావును వివరణ కోరగా.. ‘అనుమతులు లేకుండా మట్టి, కంకర తవ్వకాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. మహేంద్రతనయలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. నదిని పరిశీలించి చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.