Share News

ప్రాణాలు తీసుకుంటున్నారు..

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:34 AM

జిల్లాలో ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రాణాలు తీసుకుంటున్నారు..

- జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు

- క్షణికావేశంలో జరుగుతున్నవే ఎక్కువ

- బాధితుల్లో యువతే అధికం

రణస్థలం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

- పలాస రైల్వేస్టేషన్‌ సమీపంలో కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల పూజ, తన ఇద్దరు పిల్లలు కుశాంత్‌, దీక్షితతో కలిసి గురువారం బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశానికి గురై అఘాయిత్యానికి పాల్పడింది.

-ఈ నెల 17న ఎల్‌ఎన్‌పేట మండలం చిన్నకొల్లివలస ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో గొబ్బక లావణ్య అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు మూడు నెలల కిందట పలాసకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి కన్నవారి ఇంటివద్దే ఉంది. చీమలమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

- గత నెల 16న శ్రీకాకుళం నగరంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి బెండి సత్యం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులతో విభేదాల వల్ల ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం మత్తులో నిప్పంటించుకొని చనిపోయాడు.

- గత నెల 29న పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ పరిధిలోని జయరామచంద్రాపురానికి చెందిన పూడి చిన్నబాబు అనే యువకుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. వేరే వ్యక్తితో జరిగిన చిన్నపాటి వివాదంతో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకున్నాడు

- ఏప్రిల్‌ 20న శ్రీకాకుళం డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లో నాగావళి వంతెనపై నుంచి దూకి సీపాన వెంకటేష్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో ఎమ్మెస్సీ చదువుతున్న వెంకటేష్‌ గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


జిల్లాలో ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఆత్మహత్య ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. చదువులో రాణించలేదని, ప్రేమ విఫలమైందని, మద్యానికి బానిస అయ్యానని, కుటుంబ కలహాలు..ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక కారణంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఎక్కువగా క్షణికావేశానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినవారిని, తమవారిపై ఆధారపడి ఉన్నవారిని మరిచిపోతున్నారు. ఫలితంగా కుటుంబాలు వీధినపడుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి, ఆత్మనూన్యతాభావంతో ఎక్కువ మంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశం నుంచి మనసును కొద్దిసేపు మళ్లించగలిగితే ఆత్మహత్యలను అదుపులోకి తీసుకురావచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.


కష్టాలు సహజం..

ప్రతిఒక్కరి జీవితంలోనూ కష్టాలు సహజం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కొందరు అలాకాకుండా క్షణికావేశంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బంగారు భవిష్యత్‌ను చేజేతులా పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా కుటుంబసభ్యులంతా ఒకచోట కూర్చోవాలి. కుటుంబసభ్యుడు కష్టంలో ఉన్న, మానసిక పరిస్థితి బాగాలేకున్నా గుర్తించాలి. కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అవసరమైతే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.

- మద్యానికి అలవాటు అయిన వారు విచక్షణ కోల్పోతుంటారు. అనవసరంగా వివాదాలు పెట్టుకుంటుంటారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. యువతలో బలహీన క్షణాలకు, మనస్తాపాలకు కారణం మాత్రం ముమ్మాటికీ మద్యమే. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే.

- ఎక్కువ మంది యువత ప్రేమ విఫలం, ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బు పొగొట్టుకోవడం, చదువు ఒత్తిడి, చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోవడం వంటి కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇటీవల యువత ఎక్కవుగా ఆన్‌లైన్‌ రమ్మీ, కెసినో, పబ్జి వంటి వ్యామోహిత గేమ్‌లకు అలవాటుపడి డబ్బులు పొగొట్టుకుంటున్నారు. ఏమి చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నారు.


- చదువు ఒత్తిడి కూడా చాలామందిని ఇబ్బంది పెడుతోంది. పదో తరగతి వరకూ తెలుగుమీడియంలో ఉండి..ఒక్కసారిగా కార్పొరేట్‌ కాలేజీల్లో చేరేసరికి ఒత్తిడికి గురవుతున్నారు. పైగా అక్కడి హాస్టల్‌ వాతావరణం, తరగతులు, ఇంగ్లీష్‌ మీడియం బోధనకు తట్టుకోలేక కొందరు విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధాలు కూడా నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి.

కౌన్సెలింగ్‌తో మార్పు..

ఆత్మహత్యలు వంటి తీవ్ర నిర్ణయాలు రావడానికి కారణం ఒత్తిడి. కుటుంబ జీవనంలో ఒత్తిడి తట్టుకోలేక ఎక్కువ మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు దిగుతున్నారు. అందుకే పిల్లల వ్యవహార శైలిని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గమనిస్తుండాలి. మానసిక పరిస్థితుల్లో మార్పులు వస్తే వెంటనే కౌన్సెలింగ్‌ చేసి కొంత వరకూ నిర్ణయాల్లో మార్పులు తీసుకురావచ్చు.

-మానసిక వైద్య నిపుణుడు, శ్రీకాకుళం

Updated Date - Jun 20 , 2026 | 12:34 AM