Share News

ధాన్యం రైతును దోచేస్తున్నారు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:08 AM

No Grain purchasing centers రబీలో పండించిన ధాన్యం నిల్వలు కళ్లాల్లో పేరుకుపోతున్నాయి. చాలాచోట్ల ధాన్యం విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతు సేవాకేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఇంతవరకూ అనుమతులు రాలేదు.

ధాన్యం రైతును దోచేస్తున్నారు
కంబకాయి జంక్షన్‌ వద్ద సర్వీసు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం

  • రబీ సీజన్‌లో కానరాని కొనుగోలు కేంద్రాలు

  • అకాలవర్షాలతో అవస్థలు

  • దళారులను ఆశ్రయిస్తున్న రైతులు

  • ఇదే అదునుగా తక్కువ ధరకు కొనుగోలు

  • బస్తాకు రూ.1,900 మాత్రమే చెల్లింపు

  • నరసన్నపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి):

  • నరసన్నపేట భవానీపురానికి చెందిన నేతింటి రాజేశ్వరరావు.. రబీ సీజన్‌లో ఐదు ఎకరాల్లో వరిసాగు చేశారు. పంట చేతికి వచ్చింది. ఎకరాకు 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. కానీ ధాన్యం కొనేవారు లేక రోడ్లపై ఆరబెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రబీ సీజన్‌లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

  • నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన రెడ్డి కృష్ణారావు, శంకరరావు, రాములు పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశారు. రబీలో ఇంజన్ల సాయంతో పంటకు సాగునీటిని అందించారు. ప్రస్తుతం దిగుబడి బాగా వచ్చినా.. ప్రఽభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దళారీలు బస్తా ధాన్యం రూ.1,900 నుంచి రూ.2,100 మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు.

  • రబీలో పండించిన ధాన్యం నిల్వలు కళ్లాల్లో పేరుకుపోతున్నాయి. చాలాచోట్ల ధాన్యం విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతు సేవాకేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఇంతవరకూ అనుమతులు రాలేదు. మరోవైపు వాతావరణం మార్పులతో ధాన్యం నిల్వ చేసేందుకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో రైతులు దళారీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, దళారీలు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు.

  • ఈ ఏడాది రబీ సీజన్‌లో జిల్లాలోని జలుమూరు, నరసన్నపేట, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం, పాతపట్నం తదితర మండలాల్లో సుమారు సుమారు 20వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. చాలాచోట్ల కోతలు పూర్తయి.. ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెడుతున్నారు. సుమారు 20వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందని ప్రాథమిక అంచనా. కాగా.. ప్రభుత్వం రబీసీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌జీఎల్‌, షుగర్‌లెస్‌ వంటి సన్నాలు రకాల బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. 80 కేజీల ధాన్యం బస్తా రూ.2,300కు కొనుగోలు చేయాల్సి ఉండగా.. దళారీలు సిండికేట్‌గా వ్యవహరించి.. సుమారు రూ.1,900కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు పొల్లు, మట్టి పేరిట బస్తాకు రెండు నుంచి మూడు కేజీల మార్జిన్‌ తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో దళారీలకు ధాన్యం విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రబీ సీజన్‌లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు.

  • బియ్యం విక్రయాల్లోనూ దోపిడీ

  • జిల్లాలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండపేట, సామర్లకోట తదితర ప్రాంతాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. రోజూ సుమారు పది లారీల ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. 80 కేజీల సన్నరకాల ధాన్యం బస్తాను రూ.1,900 కొనుగోలు చేస్తున్నారు. ఆ ధాన్యం మరపడితే 60 కేజీల బియ్యం దిగుబడి వస్తుంది. ఆ బియ్యాన్ని బస్తాల్లో ప్యాకింగ్‌ చేసి.. కిలో రూ.65 చొప్పున 3,900కు విక్రయిస్తున్నారు. అంటే బస్తా ధాన్యం వద్ద రెట్టింపు లాభాన్ని దళారీలు పొందుతున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:08 AM