చంపేస్తున్నారు!
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:25 AM
Increasing murders in the srikakulam జిల్లాలో హత్యాఘటనలు పెరుగుతున్నాయి. మానవతా విలువలు మంట గలిసిపోతున్నాయి. క్షణికావేశానికి గురై కొంతమంది కుటుంబసభ్యులే హంతుకులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగదాలతో రక్త సంబంధీకులు, కట్టుకున్న భార్యాభర్తలు ఒకరినొకరు హతమార్చుకుంటున్న ఘటనలు జిల్లాలో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో పెరుగుతున్న హత్యలు
వివాహేతర సంబంధాలతోనే అధికం
ఆర్థిక విభేదాలతో అఘాయిత్యాలు
రణస్థలం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో హత్యాఘటనలు పెరుగుతున్నాయి. మానవతా విలువలు మంట గలిసిపోతున్నాయి. క్షణికావేశానికి గురై కొంతమంది కుటుంబసభ్యులే హంతుకులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగదాలతో రక్త సంబంధీకులు, కట్టుకున్న భార్యాభర్తలు ఒకరినొకరు హతమార్చుకుంటున్న ఘటనలు జిల్లాలో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి ఘటనలు వెనుక బలమైన కారణాలుగా వివాహేతర సంబంధాలే ఎక్కువగా ఉన్నాయి. సహ ధర్మచారి వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక క్షణికావేశానికి గురై హత్యలకు తెగబడుతున్నారు. పిల్లలను అనాథలను చేస్తున్నారు. హంతకులు కటకటాలు పాలవగా.. హత్యలకు సహకరించిన వారికీ శిక్షలు పడుతున్నాయి. వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే.. పరిష్కార దిశగా పెద్దలు ఆలోచన చేసేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో ఎవరి జీవితం వారిది అన్నట్టు భార్య, భర్తతోపాటు పిల్లలు వ్యవహరిస్తున్నారు. దీంతో ఏది మంచి? ఏది చెడు? జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడం ఎలా? అనేది తెలియడం లేదు. తాను బాగుంటే సరి.. మిగతావాళ్లు ఏమైనా ఫర్వాలేదు అన్న ధోరణి సమాజంలో ఎక్కువగా పెరుగుతోంది. ఇదే నేర సంస్కృతికి కారణమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఘటనలెన్నో:
శ్రీకాకుళంలోని ప్రకాష్‌నగర్ కాలనీలో ఈ నెల 4న రాత్రి అసిరినాయుడు అనే వ్యక్తిని భార్య విజయలక్ష్మి దారుణంగా హత్య చేసింది. అయితే క్షణికావేశంతోనే ఈ ఘటన జరిగినట్టు అంతా భావించారు. కానీ ఆమె తన కుమారుడు, అల్లుడితో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. భర్త మద్యం తాగి వేధింపులకు గురిచేయడంతోనే హత్య చేసినట్టు అంగీకరించింది. ఆ ముగ్గురినీ సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
ఏప్రిల్ 29న కొత్తూరు మండలం చిన్నరాజపురంలో సవర ఎల్లంగి, గయాని అనే దంపతులను దారుణంగా హత్యచేశారు. చేతబడి నెపంతో హింసించి చంపేసినట్టు పోలీసు విచారణలో తేలింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏప్రిల్ 1న పాత హిరమండలానికి చెందిన గిరిజన బాలిక దారుణ హత్యకు గురైంది. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చదువు చెప్పిస్తానని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. తరువాత మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంటికి అప్పగించాడు. లైంగిక దాడితో పాటు హత్య చేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించగా.. వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది మార్చి 1న శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మేనేజర్ మోహనకృష్ణ హత్యకు గురయ్యారు. అదే రోజు రాత్రి శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో వస్తుండగా మోహన్‌కృష్ణకు మరో యువకుడితో వాగ్వాదం చోటుచేసుకుంది. క్రమేపీ అది పెద్దది కావడంతో సదరు యువకుడు తోసేశాడు. ఈ ఘటనలో మోహన్‌కృష్ణ చనిపోయాడు.
ఫిబ్రవరి 26న శ్రీకాకుళంలో ఓ ట్రాన్స్‌జెండర్ హత్యకు గురయ్యారు. ట్రాన్స్‌జెండర్‌తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్థిక కారణాలతో హత్య చేసినట్టు పోలీస్ విచారణలో తేలింది.
పథకం ప్రకారం
ఒకప్పుడు హత్యలు క్షణికావేశంలో జరిగేవి. ప్రస్తుతం హతమార్చేందుకు పన్నుతున్న పన్నాగాలు అందర్నీ విస్తుగొలిపేలా ఉన్నాయి. వివాహేతర సంబంధాలతో భార్య, ప్రియుడితో కలిసి ఎక్కువగా హతమార్చిన ఘటనలు బయటపడుతున్నాయి. వివాహ బంధంతో కలిసి ఉండేందుకు ఇష్టపడకపోవడం, విడిపోవాలంటే వెంటనే వీలుకాకపోవడం వల్ల కూడా హత్యలు పెరుగుతున్నాయి. మరోవైపు మద్యం, గంజాయి మత్తులో విచక్షణ కోల్పోతుంటారు. ఆ సమయంలో మాటామాటా పెరిగి హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా పట్టుబడుతున్న గంజాయి చూస్తుంటే ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో అర్ధం అవుతోంది. అందుకే మద్యం మత్తులో ఉండేవారితో వీలైనంతగా వాదనలు పెట్టుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
విలువలను నేర్పాలి
ప్రజల్లో మానవతా విలువలు పెరగాలి. అప్పుడే జీవనం సాఫీగా ముందుకు సాగుతుంది. భార్య, భర్త ఇద్దరూ ఇష్టం లేకుండా కలిసి జీవించడం చాలా కష్టం. దంపతుల మధ్య బేధాభిప్రాయాలు.. వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయి. డబ్బే ప్రధానంగా మారి రక్తసంబంధీకులనే హత్య చేయడం సరికాదు. ఉన్నదానితో సంతృప్తి చెందడం ప్రశాంత జీవనానికి ముఖ్యం. ఇది గ్రహిస్తే అసలు అనర్థాలే జరగవు.
- ఓ మానసిక వైద్య నిపుణురాలు, శ్రీకాకుళం