ఇసుకను తోడేస్తున్నారు
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:04 AM
వంశధార నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
వంశధార నదిలో అక్రమంగా తవ్వకాలు
లుకలాంలో అనధికార రీచ్
ట్రాక్టర్ లోడుకు రూ.400 చెల్లింపు
లోకల్ టాక్స్ కింద మరో రూ.100
నరసన్నపేట, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వంశధార నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. లుకలాం, గోపాలపెంట గ్రామాల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతూ ఇతర ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. మడపాంకు చెందిన ఒక ఆసామి లుకలాం గ్రామంలో అనధికారికంగారీచ్‌ను నిర్వహిస్తున్నారు. నదిలో యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా గ్రామ శివారుకు తరలించి, అక్కడ లారీలకు లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నది నుంచి ఇసుకను తెచ్చేందుకు గ్రామానికి చెందిన ట్రాక్టర్లకు ఒక్కొక్క లోడుకు రూ.400 చెల్లించగా, అదే గ్రామానికి చెందిన కొందరి నాయకులకు రూ.100 చొప్పున మామూళ్లు ఇస్తున్నారు. లుకాలం నుంచి నరసన్నపేటకు ఉర్లాం- బాలసీమ మీదుగా రోజుకు వందల సంఖ్యలో వాహనాల్లో అక్రమ రవాణా జరుగుతుంది. నిబంధనల ప్రకారం నదిలో ఇతరులు ఇసుకను తవ్వి తరలించకూడదు. కానీ, కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను ఒడ్డున డంప్ చేసి యథేచ్ఛగా లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం మైనింగ్ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో జలుమూరు, పోలాకి, నరసన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపడుతున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై తహసీల్దార్ ఆర్.సత్యనారాయణను వివరణ కోరగా.. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపడితే తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, సచివాలయ అఽధికారులకు చెప్పినట్లు తెలిపారు.