అడిగేవారు లేరని... తవ్వేస్తున్నారు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:37 PM
Illegal sand mining ఇసుకాసురుల తీరుతో నాగావళి నదీ గర్భానికి కోత తప్పడం లేదు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో.. కిల్లిపాలెం పరిధిలోని నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు
కలెక్టరేట్ చెంతనే అయినా.. పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం రూరల్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఇసుకాసురుల తీరుతో నాగావళి నదీ గర్భానికి కోత తప్పడం లేదు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో.. కిల్లిపాలెం పరిధిలోని నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వకాలు చేపట్టి.. ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో లోడు సుమారు రూ.10వేలకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు కళ్లెదుటే ఇసుక దందా సాగుతున్నా.. పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కిల్లిపాలెం నుంచి కునుకుపేట మీదుగా కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు చేసుకుని మరీ ఇసుకను తరలిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో నదిలో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలకు ఆటంకం కలుగుతోందని, నీరు కాలుష్యమవుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాల నిలుపుదలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ఎస్.గణపతిరావు వద్ద ప్రస్తావించగా.. ‘కిల్లిపాలెం పరిధిలో యంత్రాలతో ఇసుక తవ్వడానికి ఎటువంటి అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చట్టరీత్యా నేరం. నాగావళి తీరాన్ని పరిశీలించి.. ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.