రోడ్డు కోసం.. చెరువునే కప్పేస్తున్నారు
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:00 AM
Invasion of Jagannath Sagar పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు తలమానికంగా ఉన్న జగన్నాథసాగరాన్ని(పెద్దచెరువు) అక్రమార్కులు రోడ్డు కోసం కప్పేస్తున్నారు. ఆక్రమణల కారణంగా చెరువు కుచించుకుపోతోందని, భవిష్యత్తులో నీటికుంటగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుచించుకుపోతున్న జగన్నాథసాగరం
పలాస, జనవరి 4(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు తలమానికంగా ఉన్న జగన్నాథసాగరాన్ని(పెద్దచెరువు) అక్రమార్కులు రోడ్డు కోసం కప్పేస్తున్నారు. ఆక్రమణల కారణంగా చెరువు కుచించుకుపోతోందని, భవిష్యత్తులో నీటికుంటగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశధార, దేశబట్టి కాలువ ఆధారంగా జగన్నాథసాగరం చెరువు ఏర్పడింది. మొత్తం 60 ఎకరాలకుపైగా విస్తీర్ణం గల ఈ చెరువులో నిత్యం నీరు ఉంటుంది. పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు ఈ చెరువులో నీరు సరప్లస్‌వియర్(పరుపు) ద్వారా పంట పొలాలకు అందుతుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ చెరువు ఆక్రమణకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.
పలాస నుంచి కాశీబుగ్గకు రావడానికి చెరువు పక్కన చిన్నపాటి గోర్జి ఉండేది. ఈ ప్రాంతంలోనే మునిసిపాలిటికి చెందిన పంప్‌హౌస్ ఉంది. ప్రజలకు తాగునీరు కూడా ఈ చెరువులో ఏర్పాటు చేసిన బావుల నుంచే వస్తుంది. గోర్జి ప్రాంతానికి ఆనుకుని పంట పొలాలను ఇటీవల రియల్‌ఎస్టేట్‌గా మార్చుతున్నారు. ఆ ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో గోర్జిని వెడల్పు చేసి పక్కా రోడ్డుగా వేయడానికి అక్రమార్కులు స్కెచ్ వేశారు. ముందుగా వ్యర్థాలను ఆ ప్రాంతంలో వేయడం, తరువాత ఎవరూ లేని సమయంలో దాన్ని చెరువులోకి మళ్లించి దారి వెడల్పు చేస్తున్నారు. మూడు నెలల నుంచి ఈ తతంగం జరుగుతోంది. ఇప్పటికే వంద మీటర్ల వరకూ రహదారికి సిద్ధం చేయగా, మరో వంద అడుగుల రహదారి లేఅవుట్‌కు అనుసంధానంగా సరిచేశారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే పూర్తిగా చెరువు గట్టును కప్పి రహదారిగా మారడం ఖాయమని స్థానికులు పేర్కొంటున్నారు. చెరువును కాపాడకుంటే సాగునీటికి కూడా కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి జగన్నాథసాగరం చెరువును పరిరక్షించాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి వద్ద ప్రస్తావించగా ‘జగన్నాథసాగరం పరిశీలించాం. 20 సెంట్లు వరకూ ఆక్రమణలు జరిగినట్లు గుర్తించాం. మొత్తం చెరువును సర్వేచేసి ఆక్రమణలు తొలగిస్తాం. చెరువును కప్పడానికి యత్నించిన వారిని గుర్తించి అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామ’ని హెచ్చరించారు.